‘సీటీమార్’ తో ప్లాపుల నుండి బయటపడ్డ గోపీచంద్ త్వరలో ‘పక్కా కమర్షియల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులు కాగా బన్నీ వాసు నిర్మాత. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. గోపీచంద్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడటం ఖాయమనే సంకేతాలు ఇచ్చింది ఈ ట్రైలర్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు గోపీచంద్.
ఇందులో భాగంగా ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. అతని మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతనే విషయాన్ని బయటపెట్టాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. ” ‘జయం’ చిత్రానికి నాకు రూ.11 వేలు పారితోషికం ఇచ్చారు. తేజ గారే ఆ చిత్రానికి నిర్మాత. పైగా 11 అనేది ఆయనకి లక్కీ నెంబర్ అట. అలాంటప్పుడు ఇంకో సున్నా పెంచి ఇవ్వొచ్చు కదా అని నాకు అనిపించింది. ఆ డబ్బుని ఇంట్లో పెట్టాను.
ఎలా ఖర్చయ్యాయి అనే విషయం తెలియదు.. త్వరగా ఖర్చయిపోయాయి” అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. అయితే గోపీచంద్ మొదటి చిత్రం ‘తొలివలపు’. ‘జయం’ కంటే ఓ ఏడాది ముందే ఆ చిత్రం వచ్చింది. ఇందులో గోపీచంద్ హీరోగా నటించాడు. తన సొంత నిర్మాణంలో రూపొందిన సినిమా. ఈ మూవీ ఏమాత్రం ఆడలేదు. దాంతో భారీ నష్టాలు వచ్చాయి.
అందుకే ఈ మూవీకి గాను గోపీచంద్ కు చిల్లిగవ్వ కూడా మిగల్లేదు అని స్పష్టమవుతుంది. ఇక ‘జయం’ తో పాటు ‘నిజం’ ‘వర్షం’ వంటి చిత్రాల్లో కూడా గోపీచంద్ విలన్ గా నటించాడు. విలన్ గా సక్సెస్ అయిన తర్వాత హీరోగా మళ్ళీ ‘యజ్ఞం’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అక్కడి నుండీ గోపీచంద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.