అక్కడ సర్కారు వారి ఓటీటీ.. రూ.75కే సినిమాలు… మనకెప్పుడో?

ప్రభుత్వం నుండి ఓ ఓటీటీ రావాలి… ప్రస్తుతం ఉన్న ఓటీటీల గుత్తాధిపత్యం పోవాలి అని మనం చాలా రోజుల నుండి మాటలు వింటూనే ఉన్నాం. సినిమాల ధర విషయంలో, సబ్‌స్క్రిప్షన్‌ల విషయంలో ఓటీటీలు మొండిగా ఉంటున్నాయని, చిన్న సినిమాలకు సరైన గౌరవం దక్కడం లేదనే విమర్శలూ ఉన్నాయి. వీటన్నింటికి విరుగుడు ‘ప్రభుత్వ ఓటీటీ’ అని సినిమా పరిశీలకులు చెబుతూ వచ్చారు. లేదంటే సినిమా పరిశ్రమే ఓ ఓటీటీ తీసుకురావాలి అని అన్నారు.

తెలుగు సినిమా విషయంలో ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. అయితే ఇంకా ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే దేశంలో కొన్ని రకాల విప్లవాలకు, కొత్త పనులకు ముందడుగు వేసే రాష్ట్రాల్లో ఒకటైన కేరళ ఈ దిశగా అడుగేసేసింది. దేశంలోనే తొలి ప్రభుత్వ ఓటీటీని కేరళ ప్రభుత్వం స్టార్ట్‌ చేసింది. సీస్పేస్‌ ఓటీటీ పేరుతో ఈ ఓటీటీ ప్రారంభమైంది. ప్రైవేట్‌ ఓటీటీల ఉద్దేశం లాభాన్ని ఆర్జించడమేనని, ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయని కేరళ ప్రభుత్వం భావించి ఈ ఓటీటీ తెచ్చింది.

సీస్పేస్‌ ఓటీటీలో (OTT) యూజర్లు పే – పర్‌ – వ్యూ ఆధారంగా సినిమాలను చూడవచ్చు. రూ.75కే సినిమాలను చూడొచ్చు. అలా చూసిన సినిమాలకు చెల్లిస్తే చాలు. 40 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌లు రూ. 40కి, 30 నిమిషాల సినిమాలు రూ. 30కి, 20 నిమిషాల కంటెంట్‌ రూ.20కి చూడొచ్చు. ఈ ఓటీటీలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న సినిమాలు, ఫిల్మ్‌ అకాడమీ నిర్మించిన పిక్చర్‌లు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్‌లు ఉంటాయి.

ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయంలో సగం ఫిల్మ్‌ అకాడమీకి , మిగిలిన సగం సినిమా నిర్మాతలకు వెళ్తుందట. కొత్త దర్శకులు తమ సినిమాల కోసం సీస్పేస్‌ ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ కూడా చేసుకోవచ్చట. కేరళ ఈ విషయంలో ఓ అడుగు ముందేసిన నేపథ్యంలో తెలుగు సినిమా ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి. నిర్మాతలు అప్పుడెప్పుడో అన్న మాటను ముందుకు తెస్తారా, లేక ప్రభుత్వాలను ఏమన్నా సంప్రదిస్తారేమో చూడాలి.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus