తెలుగు సినిమాలో యాక్షన్ సీన్లు అంటే ఒకప్పుడు ఫైట్లు… ఆ తర్వాత ఛేజ్‌లు వచ్చాయి. ఆ ఛేజ్‌లు కూడా ఒక కారు వెనుక మహా అయితే రెండు, మూడు కార్లు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు అయితే సుమోల కాన్వాయ్ నడిచేది. ఒక్కో సీన్‌లో 100 వరకు వాహనాలు వాడేవారు. ఇప్పుడు అలాంటి సీన్లు తగ్గిపోయాయనుకోండి. అయితే అలా ఎక్కువ వాడటం మనకు మొన్నీమధ్య కానీ… హాలీవుడ్‌లో 1970వ దశకంలోనే ఉంది. ‘గాన్ ఇన్ 60 సెకండ్స్’ అనే సినిమాలో ఏకంగా ఓ ఛేజ్ కోసం 90 కార్లు వాడారట..
అంతే కాదు అవన్నీ ధ్వంసమవడం గమనార్హం. అత్యంత ఎక్కువ నిడివి గల ఛేజింగ్ సీన్ ఏ సినిమాలో ఉందో తెలుసా? దీని కోసం అంతగా ఆలోచించక్కర్లేదు. ఇంతకుముందు చెప్పిన ‘గాన్ ఇన్ 60 సెకండ్స్’ అనే సినిమాలోనే ఉంది. ఇందులో ఓ ఛేజ్ సీన్ సుమారు 40 నిమిషాలపాటు ఉంటుందట. ఈ సన్నివేశంలో సుమారు 90 కార్లు ధ్వంసం అయ్యాయట. 1974లో వచ్చిన ఈ సినిమాలో ఆ ఛేజింగ్ సీన్ అప్పట్లో చాలా పాపులర్.
సుమారు లక్షా యాభై వేల డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 40 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. హెచ్.బి.హలిక్కి ఈ సినిమాకు ఆల్ రౌండర్. అంటే ఆయన కథ సిద్ధం చేసి, దర్శకత్వం వహించి, హీరోగా నటించాడు. ఆ ఛేజింగ్ సీన్ మీరూ చూసేయండి.