గ్లోబల్ ఇమేజ్ రాగానే మన హీరోలు చేసిన అతి పెద్ద పొరపాటు.. పరాయి బ్రాండ్స్ ను నమ్ముకోవడం. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన కిక్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్ల వైపు పరిగెత్తారు. కానీ 2025లో వచ్చిన ఫలితాలు వారికి గట్టి గుణపాఠం నేర్పాయి. మన నేటివిటీని, మన మాస్ పల్స్ ను పట్టుకోవడంలో బయటి దర్శకులు ఫెయిల్ అయ్యారు. దీంతో విలువైన సమయం వృథా అయ్యింది. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుని మళ్లీ మన లోకల్ టాలెంట్ వైపు చూస్తున్నారు.
నిజానికి శంకర్ గానీ, అయాన్ ముఖర్జీ గానీ గొప్ప దర్శకులే. కానీ మన తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్, ఆ రా అండ్ రస్టిక్ ఫీల్ వారికి దొరకలేదు. బ్రాండ్ నేమ్స్ సినిమాకు హైప్ తెస్తాయి కానీ, హిట్ తేలేవు అనే లాజిక్ ను మన స్టార్స్ కొంచెం లేట్ గా గ్రహించారు. అందుకే ఇప్పుడు స్ట్రాటజీ మొత్తం మార్చేసి, మన మట్టి వాసన తెలిసిన దర్శకులతో చేతులు కలిపారు.
రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సానాతో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఇందులో చరణ్ ను చాలా కొత్తగా, ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామాలో చూపించబోతున్నారు. ఇక్కడ శంకర్ సినిమాలో కనిపించిన ఆర్టిఫిషియల్ హంగులు ఉండవు. కేవలం స్వచ్ఛమైన ఎమోషన్, గూస్ బంప్స్ తెప్పించే మన నేటివిటీ మాత్రమే ఉంటుంది. అందుకే చరణ్ ఈ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ ను లైన్లో పెట్టారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇంకా ఫైనల్ కాకపోయినా, ఈ టైటిల్ వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. మన మాస్ హీరోను ఎలా చూపిస్తే థియేటర్లు దద్దరిల్లుతాయో నీల్ కు బాగా తెలుసు. బాలీవుడ్ క్లాస్ టచ్ కాకుండా, నీల్ మార్క్ ఊర మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో ఉంటాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఇన్నాళ్లు పాన్ ఇండియా, గ్లోబల్ అంటూ చేసిన ప్రయోగాలు చాలు, ఇక మన దారిలో మనం వెళ్దాం అని డిసైడ్ అయ్యారు. ‘పెద్ది’తో చరణ్, ‘డ్రాగన్’ తో ఎన్టీఆర్ రాబోయే ఏడాది బాక్సాఫీస్ లెక్కలు సరిచేయడం ఖాయం. బ్రాండ్స్ మోజులో పడి చేసిన డ్యామేజ్ ను, మన లోకల్ డైరెక్టర్లే రిపేర్ చేస్తారన్నమాట. మొత్తానికి 2025 ఒక చేదు జ్ఞాపకం అయితే, 2026 మాత్రం ఫ్యాన్స్ కు అసలైన పండగ కాబోతోంది.
