రెండు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా మంత్రి కేటీయార్లు స్టార్ కమెడియన్ గుండు హనుమంతరావుగారికి శస్త్ర చికిత్సల కోసం భారీగా ఋణ సహాయం చేసిన విషయం తెలిసిందే. అందిన ఆర్ధిక సహాయంతో ఆయన చికిత్స చేయించుకొని ఇటీవల రెండు మూడు టీవీ షోస్ కి కూడా హాజరయ్యారు. అంతా సెట్ అనుకొంటున్న తరుణంలో తెల్లవారుఝామున 3 గంటలకి ఆయన ఎస్.ఆర్.నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఎవ్వరూ ఊహించని ఈ మరణం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.
దాదాపు 400లకి పైగా చిత్రాల్లో నటించడమే కాక టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితులైన గుండు హనుమంతరావు గారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. “అహ నా పెళ్లంట, యమలీల, టాప్ హీరో, పేకాట పాపారావు, ఘటోత్కచుడు, నువ్వు లేక నేను లేను” వంటి చిత్రాలకు ఆయనకి కమెడియన్ గా విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టగా.. “అమృతం” సీరియల్ లో అంజిగా అశేషమైన తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరించి, కడుపుబ్బ నవ్వించిన హనుమంతరావుగారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ.. ఆయన పండించిన హాస్యం మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంటుంది.