బాలకృష్ణ సినిమాలో దర్శకుడు మారినా, హీరోయిన్లు మారినా, సెటప్ మారినా, గెటప్ మారినా.. గత ఐదు సినిమాలుగా సంగీతం మాత్రం మారడం లేదు. 2021 నుంచి 2026 వరకు బాలయ్య ఐదు సినిమాలు చేశారు. ఆ సినిమాలకు సంగీతం అందించింది తమన్. ఇప్పుడు చేస్తున్న సినిమా ‘దాదా’కి కూడా ఆయనే మ్యూజిక్ డైరక్టర్. అయితే బాలయ్య చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంగీత దర్శకుడు మారబోతున్నారు..
వరుసగా ఒకే మ్యూజిక్ అని టీమ్ అనుకుందో, లేక తమన్ ఇంకేదైనా సినిమా చేయాల్సి ఉందో కానీ.. కొరటాల శివతో బాలయ్య చేయబోయే సినిమాకు సంగీత దర్శకుడిని మార్చాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిన ఈ సినిమా షూటింగ్‌ని ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి. కానీ బాలయ్యకు ‘దాదా’ సెట్‌లో ప్రమాదం జరగడంతో మొత్తం షెడ్యూల్స్ మారిపోయి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అయింది.
ఇప్పుడు బాలయ్య తిరిగి సెట్స్ మీదకు రావడంతో కొరటాల తన సినిమా పనులు వేగవంతం చేశారట. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఓకే చేసుకున్నారని టాక్. తొలుత అనిరుధ్ రవిచంద్రన్‌ను ఓకే అనుకున్నా.. వివిధ కారణాల వల్ల ఆయన నుండి జీవీవైపు వచ్చారట. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘జనవరి 12 విడుదల’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చేయబోయేది ఈ సినిమానే అని చెప్పొచ్చు. అన్నట్లు రీసెంట్‌గా ఆయన ‘ఇరుముడి’తో మంచి హిట్ కొట్టారు కూడా.
ఇక తమన్ – బాలయ్య అనుబంధం చూస్తే.. ‘అఖండ’తో మొదలైన వీరి ప్రయాణం ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’, ‘అఖండ 2: తాండవం’, ‘దాదా’ వరకు కొనసాగతింది. మరిప్పుడు ‘కార్పెంటర్’ (కొరటాల శివ ఈ పేరు అనుకుంటున్నారని టాక్)తో మొదలైన బాలయ్య – జీవీ ప్రయాణం ఎన్ని సినిమాల వరకు సాగుతుందో చూడాలి.