Hari Teja: జాగ్రత్తగా ఉండండి: తన కష్టం వినిపించిన హరితేజ!

  • April 29, 2021 / 09:40 AM IST

ఆ మధ్య బేబీ బంప్‌తో ఫొటోలు పొట్టి చాలా సందడి కనిపించింది బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ. అయితే తనకు ఆడబిడ్డ పుట్టిందని మాత్రం సాదాసీదాగా పోస్ట్‌ చేసింది. అది కూడా పాప పుట్టిన ఒక రోజు తర్వాత. ఎందుకబ్బా ఎంతో సంతోషకరమైన విషయాన్ని ఇలా చప్పగా చెప్పింది అని అందరూ అనుకున్నారు. ఏమో ఏ కంగారులో ఉన్నారో అని ఊరుకున్నారు. అయితే దీని వెనుక చాలా పెద్ద విషయమే ఉందని తాజాగా తెలిసింది. అంతేకాదు తాను పడ్డ కష్టం చాలామందికి కనువిప్పు కావాలని హరితేజ ఓ వీడియోను షేర్‌ చేసింది. అది చూస్తే మీ కళ్లు చెమర్చడం ఖాయం. ఇంకా ఆ వీడియోలో హరితేజ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే…

‘‘నాకు ఆడబిడ్డ పుట్టిందని చాలామంది విష్ చేశారు. అందరికీ థాంక్స్. అయితే ఆ సమయంలో రిప్లై ఇచ్చే పరిస్థితిలో నేను లేను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు ఎందుకు నేను ఆ పరిస్థితిలో నేను అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ విషయాలన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బయట పరిస్థితులు చూస్తుంటే, న్యూస్‌ వింటుంటే, నేను కూడా కొన్ని విషయాలు చెబితే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే నాకు జరిగిన విషయాలు చెప్తేనైనా కొంతమంది మారతారేమో, లేక మారాలని అనుకుంటారేమో అనిపిస్తోంది’’అని వీడియోను స్టార్ట్‌ చేసింది హరితేజ.

‘‘నాకు తొమ్మిదో నెల వచ్చాక చాలా జాగ్రత్తగానే ఉన్నాను. మంచి ఆహారం తీసుకుంటూ, యోగా చేస్తూ ఆరోగ్యవంతంగా ఉన్నాను. డెలివరీకి వారం ముందు చెకప్‌ చేయించినప్పుడు అంతా బాగానే ఉంది. నార్మల్ డెలివరీనే అవుతుందని చెప్పారు. సరిగ్గా వారంలో నా డెలివరీ అని ఆనందంగా ఉన్నాను. అదే సమయానికి మా ఇంట్లో అందరికీ కొవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను టెస్ట్ చేయించుకుంటే నాకూ పాజిటివ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మనకి కరోనా రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాం అని చాలామంది అంటుంటారు. నేను కూడా అలానే ఎప్పుడైనా జాగ్రత్తగా లేనేమో అనిపించింది’’ అంటూ తనకు కరోనా సోకిన క్షణం గురించి చెప్పింది.

డెలివరీ పరిస్థితుల గురించి హరితేజ చెబుతూ… ‘‘కరోనా వచ్చిందని తెలిశాక వైద్యుల్ని కాంటాక్ట్‌ చేశాను. వాళ్లేమో మేం డెలివరీ చేయం అని చెప్పేశారు. మీకు పాజిటివ్ కాబట్టి కరోనా హాస్పటల్‌కి వెళ్లమన్నారు. బేబీ కోసం చాలా టెస్ట్‌లు చేశారు. ఈ సమయంలో చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. పరిస్థితిని చూసి డాక్టర్లు ఎమర్జెన్సీ సీ సెక్షన్ చేయాలి అని చెప్పారు. నార్మల్ డెలివరీ చేయడం కుదరదని అన్నారు. డెలివరీ టైమ్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా అందరూ దగ్గర ఉంటారు. నా డెలివరీకి నేను, నా భర్త మాత్రమే ఉన్నాం. ఆ సమయంలో నాకు ధైర్యం చెప్పేవాళ్లు లేరు’’ అని చెప్పింది.

‘‘డెలివరీ తర్వాత కరోనా వార్డ్‌లోనే ఉన్నాను. పాప పుట్టిన వెంటనే నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు. పాపకు నెగిటివ్‌ కాబట్టి.. నా దగ్గర ఉంచకూడదు అన్నారు. ఆఖరికి బేబీకి పాలు కూడా ఇవ్వలేకపోయాను. వీడియో కాల్‌లో పాపను చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో నా బాధ ఆ దేవుడికే ఎరుక. కరోనా నుండి కోలుకున్నాక అందరం ఐసోలేషన్‌లోనే ఉన్నాం. ఆ సమయంలో ఎవరినీ సహాయం అడగలేని పరిస్థితి. ఆ సమయంలో కొంతమంది మా స్నేహితులు అండగా నిలిచారు’’ అంటూ బిడ్డ పుట్టాక జరిగిన పరిస్థితులు చెప్పింది హరితేజ.

‘‘మనకు ఏదైనా జరిగితేనే కానీ జాగ్రత్తపడం. ఇంత జరగుతున్నా మనకి కరోనా రాదులే అని ఫీలింగ్ ఉంటుంది. అయితే అలాంటి ఆలోచన వద్దు. కరోనా వచ్చిన తరువాత బాధపడే కంటే, రాకముందే జాగ్రత్త పడటం మంచిది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంత జరుగుతున్నా చాలామంది మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. ముందే జాగ్రత్తగా ఉండండి, అవసరం లేనిదే ఎవర్నీ కలవొద్దు. ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారం తినండి. దేవుడి దయతో మా ఇంట్లో అందరం క్షేమంగా బయటపడ్డాం. అందరూ జాగ్రత్తగా ఉండండి’’అంటూ వీడియో ముగించింది హరితేజ. ఆమె జీవితంలో జరిగేదే అందరికీ జరుగుతుందని చెప్పలేం, అలాగే కరోనాతో ఇబ్బందిపడే వాళ్లందరూ ఆమెలా బయటపడతారనీ చెప్పలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మాత్రం సూచించగలం.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus