“నేను లోకల్” అనే యావరేజ్ హిట్ అనంతరం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “హలో గురు ప్రేమ కోసమే”. రామ్-అనుపమ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. దసరా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి..!!
కథ : సంజు (రామ్) కాకినాడలో సరదాగా ఫ్రెండ్స్ తో టైమ్ పాస్ చేస్తూ తిరిగే కుర్రాడు. జాబ్ కోసం హైద్రాబాద్ వచ్చి తన తల్లి స్నేహితుడైన విశ్వనాధ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో ఉంటాడు. విశ్వనాధ్ కూతురు అనుపమ (అనుపమ పరమేశ్వరన్)ను ప్రేమిస్తాడు సంజు. కానీ.. తన తల్లికి ఆప్తమిత్రుడైన విశ్వనాధ్ ను మోసం చేసి.. అతడి కూతుర్ని లేపుకుపోవడం ఇష్టం లేదు. సో, తన మీద ప్రేమ పెంచుకున్న అమ్మాయిని ఆమె అభీష్టం మేరకు ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతాడా? లేక తనకు ఆశ్రయం ఇచ్చిన విశ్వనాధ్ పరువు-మర్యాదలను దృష్టిలో పెట్టుకొని తన ప్రేమను త్యాగం చేస్తాడా? అనేది “హలో గురు ప్రేమ కోసమే” కథాంశం.
నటీనటుల పనితీరు : సంజు పాత్రలో రామ్ చాలా హుందాగా కనిపించాడు, నటించాడు కూడా. అయితే.. పాత్ర వ్యవహారశైలిలో నవ్యత లేకపోవడంతో అక్కడక్కడా నవ్వించినా ఓవరాల్ గా రొటీన్ ఉంది. అనుపమ మునుపటి సినిమాలకంటే కాస్త అందంగా కనిపించింది. అభినయం పరంగానూ ఆకట్టుకొంది. కానీ.. ఆమె క్యారెక్టర్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
చాన్నాళ్ల తర్వాత ప్రకాష్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన పాట పాడడమే కాక డ్యాన్స్ కూడా చేసి ప్రేక్షకుల్ని అలరించడం విశేషం. ప్రవీణ్ కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు, మిగతా పాత్రధారులు కనిపించీ కనిపించనట్లుగా అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ మార్చకపోయినా కనీసం వాయిద్యాలు మార్చినా బాగుండేది. ప్రతి పాట ఎక్కడో విన్నట్లే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే.. “హలో గురు ప్రేమకోసమే” సినిమా చూస్తుంటే.. “నేను లోకల్” సినిమాను గుర్తుకు చేసింది.
విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా ఓవరాల్ గా బాగానే ఉన్నాయి. రచయిత ప్రసన్న కుమార్ అందించిన కథలో కొత్తదనం లేకపోయినా.. ప్రాసలతో కూడిన కొన్ని పంచ్ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ.. క్లైమాక్స్ మాత్రం కనీస స్థాయిలో ఆకట్టుకొనే విధంగా కూడా లేదు.
త్రినాధరావు నక్కిన టేకింగ్ లో పెద్దగా మార్పులు కనిపించలేదు. మంచి దర్శకుడికి సరైన కథ దొరక్కపొతే అవుట్ పుట్ ఎలా ఉంటుంది అనేందుకు ఈ సినిమా ఒక నిదర్శనం. ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన త్రినాధరావు నక్కిన ఈ సినిమాలో సెంటిమెంట్ పండించడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా.. ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఎమోషన్స్ సినిమాలో ఎక్కడా కనిపించవు. ఉన్న కాసిన్ని మంచి సన్నివేశాలు కూడా ఎక్కడో చూసినట్లుగానే ఉంటాయి.
విశ్లేషణ : కొత్తదనం, ఆకట్టుకొనే కథనం వంటి అంశాలను ఆశించకుండా కేవలం టైమ్ పాస్ కోసం అయితే “హలో గురు ప్రేమ కోసమే” చిత్రాన్ని కాస్త ఓపిగ్గా ఒకసారి చూడొచ్చు.
రేటింగ్ : 2/5