కీర్తి సురేశ్ కెరీర్‌లో ది బెస్ట్ అని ఎప్పటికైనా చెప్పుకోగలిగే సినిమా ‘మహానటి’. దివంగత ప్రముఖ నటి సావిత్రి జీవిత కథగా రూపొందిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కోసం తొలుత వేరే నటిని అనుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆమెనే ప్రధాన పాత్రధారి అంటూ వార్తలు బాగానే వచ్చాయి. కానీ ఏమైందో ఏమో ఆ పాత్రలోకి కీర్తి సురేశ్ వచ్చింది. అయితే దీని వెనుక ఏం జరిగింది అనేది ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్ తెలిపారు.
సావిత్రి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఆలోచనతో తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. సినిమా నటీమణుల్లో సావిత్రి సాధించిన విజయాలు ఎందరికో స్ఫూర్తి. ఆమె నటిగా మారడం, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, దిగమింగిన కన్నీళ్లు.. ఇలా చాలానే ఉన్నాయి. అలాగే నటిగా కెరీర్ ప్రారంభించాక.. అగ్రనాయికగా మారడం కూడా అంత సులభంగా ఏమీ సాగలేదు. మహానటి అని అనిపించుకున్న సావిత్రి జీవితంలో చేదు కూడా చాలానే ఉంది. వీటన్నింటిని ఎంతో కన్విన్సింగ్‌గా చూపించారు ‘మహానటి’ సినిమాలో.
ఈ సినిమా వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్, అతని కుమార్తెలు నిర్మించిన విషయం తెలిసిందే. సినిమా దర్శకుడు అతని అల్లుడు నాగ్ అశ్విన్ అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికగా తొలుత ప్రముఖ మలయాళ నటిని అనుకున్నారట. ఈ విషయాన్ని అశ్వనీదత్ స్వయంగా చెప్పారు. ‘‘తొలుత మా సినిమా కోసం మలయాళ హీరోయిన్‌ను అనుకున్నాం. కథ చెప్పాక.. అందులో ‘మద్యం తాగే సన్నివేశాలున్నాయా, పెట్టొద్దు. అలాంటివి ఉంటే చేయను?’ అని ఆమె చెప్పిందట.
దీంతో దీంతో ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని అశ్వనీదత్ తెలిపారు. దీంతో ఆమె ప్లేస్‌లో కీర్తి సురేశ్‌ను తీసుకున్నాం అని చెప్పారు అశ్వనీదత్. అయితే ఆయన ఎక్కడా ఈ మాటల్లో నిత్య మేనన్ పేరు చెప్పలేదు కానీ, అప్పట్లో వినిపించింది ఆమె పేరే. కాబట్టి ‘మహానటి’ సినిమా నిత్యకు అలా దూరమైంది అనుకోవచ్చు. పూర్తి ఇంటర్వ్యూలో ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.