‘కార్తికేయ2’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నిఖిల్. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ విజయాన్ని సాధించింది. తెలుగుతో సమానంగా హిందీలో కలెక్షన్లు రాబడుతోంది ఈ మూవీ. ‘లైగర్’ చిత్రం రిలీజ్ అయినప్పటికీ నార్త్ లో ‘కార్తికేయ2’ హవా ఏమాత్రం తగ్గలేదు. ‘లైగర్’ విడుదల రోజున కూడా ‘కార్తికేయ2’ అద్భుతంగా కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించి మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు.
‘కార్తికేయ 2’ రిలీజ్ కు ముందు కూడా ఆ సినిమా రిలీజ్ విషయంలో ఎవరో అడ్డుకుంటున్నట్టు అతను చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. నిఖిల్ మాట్లాడుతూ… “మా చిత్రానికి ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే కథే మూలం. కథ బాగుంటే తప్పకుండా సినిమా విజయం సాధిస్తుంది.సినీ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుటుంబం నుండి వచ్చి నటుడిగా మారడమే నాకో పెద్ద విషయం.
ఈ రోజు ప్రేక్షకులు నా పై చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’ రోజులు గుర్తుకు వస్తున్నాయి.సినీ పరిశ్రమ అంటేనే ఓ రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ప్రతి ఒక్కరూ ఇందులోకి రావాలని ఆశ పడుతుంటారు. ఎత్తుపల్లాలు అనేవి ఇక్కడ కామన్. ‘హ్యాపీ డేస్’ తర్వాత నేను 6 సినిమాలు చేశాను.కానీ అవేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. స్టోరీ సెలక్షన్ విషయంలో నన్ను గైడ్ చేయడానికి మార్గదర్శకులెవరూ లేరు.
వరుస పరాజయాల అనంతరం సుమారు ఆరేళ్ల తర్వాత ‘స్వామి రారా’ తో సక్సెస్ అందుకున్నాను. కథే అన్నింటికంటే చాలా ముఖ్యమని అప్పుడు అర్థమైంది. నాకు కనుక ఓ గాడ్ ఫాదర్ ఉండుంటే.. కెరీర్ ఆరంభంలో అన్ని కష్టాలుండేవి కాదు. ఏది ఏమైనా కెరీర్లో సక్సెస్, ఫెయిల్యూర్ వంటివి సాధారణమే” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.