రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు కి మూడేళ్లు జైలు శిక్ష

ఉయ్యాలా జంపాల సినిమాతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21f వంటి చిత్రాలతో యువ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం లవర్ అనే సినిమా చేస్తున్నారు. యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు కి జైలు శిక్ష పడింది. ఇది ఏదో సినిమాలో సన్నివేశం ఆనుకోకండి.. రియల్ లైఫ్ విషయం ఇది. వివరాల్లోకి వెళితే… రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు విశాఖపట్నంలోని వేపగుంటలో నివసిస్తున్నారు. ఆయన సింహాచలం ఎస్‌బీఐ బ్రాంచిలో 2013లో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేస్తుండేవారు. అదే సమయంలో తన భార్య రాజ్యలక్ష్మితో పాటు అదే ప్రాంతానికి చెందిన ఎంఎస్ఎన్ రాజు, ఎన్. సన్యాసిరాజు, కె.సాంబమూర్తి, ఎన్.వెంకట్రావు పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 9.85లక్షల లోన్ తీసుకున్నారు.

తర్వాత కొద్ది రోజులకు బ్యాంకు అధికారుల తనిఖిల్లో నకిలీ బంగారు వస్తువులు బయటపడ్డాయి. బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం సీఐ నరసింహారావు దీనిపై ఓ నివేదికను కోర్టుకు అందజేశారు. విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెలువడింది. బసవరాజుకు మూడేళ్ల జైలు, 20వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాజ్ తరుణ్ తండ్రిని జైలు శిక్షనుంచి తప్పించేందుకు న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus