Vikram: విదేశీ కోతితో విక్రమ్… వివాదంలో చిక్కుకున్నాడా?
- August 12, 2026 / 08:21 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ తమిళ కథానాయకుడు విక్రమ్ వివాదంలో చిక్కుకున్నాడు. గత కొంతకాలంగా తాను పెంచుకుంటున్న లార్ గిబ్బన్ అనే విదేశీ కోతే దీనికి కారణం. ఇటీవల విక్రమ్ తన సోషల్ మీడియాలో ఆ కోతితో కలసి ఓ వీడియోను షేర్ చేశాడు. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. కానీ ఆ కోతి అంతరించిపోతున్న అరుదైన జీవజాతుల్లో ఒకటి. దీంతో జంతు ప్రేమికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలా ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా అడగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
Vikram
లార్ గిబ్బన్‌ను పెంచుకోవడానికి తగిన అనుమతిని పొందాల్సి ఉంది. దీంతో విక్రమ్ అనుమతి పొందారా.. లేదా అని అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విక్రమ్ దగ్గరున్న పత్రాల ఆధారంగా చూస్తే.. ఆ కోతి తొలుత మణిపుర్‌కు చెందిన లైకురామ్ సింగ్ వద్ద ఉన్నట్లు తెలిసింది. ఆయన 8 కోతి పిల్లలను పెంచుకోవడానికి అనుమతి పొందారని తేలింది. అవి మలేసియాకు చెందినవి అనే విషయం కూడా ఆ పత్రాల ద్వారా తెలిసింది.
ఆ ఎనిమిది కోతుల్లో మూడింటిని తమిళనాడు ఈరోడ్ జిల్లా పెరుంతురైకు చెందిన కేశనాథన్ తీసుకున్నారు. వాటిలో ఒక కోతిని ఇప్పుడు విక్రమ్ సంరక్షిస్తున్నారట. ఇదిలా ఉండగా.. ఆ వివాదం తర్వాత ఆ వీడియోను విక్రమ్ తన సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే.. అంతర్జాతీయ ఒప్పందాలు, భారత వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం ఇలా ఓ వన్య ప్రాణిని ఇంట్లో పెంచడం చట్టరీత్యా నేరం.












