ఇతర భాషల నుంచి తెలుగులో (Tollywood) డబ్బింగ్ చేసి విడుదలైన చిత్రాలు అనేకసార్లు ఇక్కడ భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులో కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమిళ్ హీరోలు రజినీకాంత్ (Rajinikanth) , కమల్ హాసన్ (Kamal Haasan), సూర్య (Suriya), కార్తి (Karthi), విజయ్ (Vijay Thalapathy) వంటి స్టార్స్ సినిమాలు తెలుగులో ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు అయితే తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తమిళ్ సినిమాల్లో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు చిత్రం చిన్న బడ్జెట్‌తో వచ్చి అంచనాలను మించి భారీ లాభాలను అందుకుంది.
50 లక్షలతో డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసిన ఈ చిత్రం 16.30 కోట్ల నికర లాభాలను రాబట్టింది. అలాగే శివ కార్తికేయన్ (Sivakarthikeyan) అమరన్ (Amaran) తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని 5 కోట్ల వ్యయంతో 23 కోట్లకు పైగా ప్రాఫిట్ ఇచ్చింది. కన్నడలో స్టార్‌గా మారిన యష్ (Yash), కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో తెలుగులోనూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం 50 కోట్లకు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేయగా, ఈ చిత్రం 84.25 కోట్ల భారీ లాభాలను అందించింది.
అదే విధంగా కాంతారా చిత్రం చిన్న సినిమాగా కనిపించినా, 2 కోట్ల బిజినెస్‌తో మొదలై 27.65 కోట్ల ప్రాఫిట్ రాబట్టి సంచలనంగా నిలిచింది. ఇదిలా ఉంటే, మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్ సినిమాలు కూడా తెలుగులో మంచి ఆదరణ పొందాయి. అయితే రజినీకాంత్ తాజా హిట్ జైలర్ (Jailer) మాత్రం అందరినీ మించి రికార్డు స్థాయిలో లాభాలను అందించింది.
ఈ చిత్రాన్ని 12 కోట్లకు కొనుగోలు చేసిన నిర్మాతలు ఏకంగా 35.90 కోట్ల ప్రాఫిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాల విజయాలు అంచనాలను మించినవే. చిన్న బడ్జెట్‌తో వచ్చినా, మంచి కంటెంట్‌తో ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ను కుదిపేశాయి. డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల స్పందన బాగా పెరిగి, ఇలాంటి చిత్రాలకు మార్కెట్ మరింత విస్తరిస్తోందని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.