‘హాయ్ నాన్న’ వెరీ క్లీన్ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ. తప్పకుండా అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ శౌర్యువ్

  • December 2, 2023 / 10:40 PM IST

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శౌర్యువ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి ? హాయ్ నాన్న జర్నీ ఎలా మొదలైయింది ?
మాది వైజాగ్. నాన్న గారు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అమ్మ గృహిణి. తమ్ముడు, చెల్లి వున్నారు. నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి రావడం జరిగింది. కన్నడ, తెలుగు సినిమా జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యవర్మ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. నాలుగేళ్ల క్రితం కథ రాసుకున్నాను.వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పినపుడు వారికి నచ్చింది. నాని గారికి పరిచయం చేశారు. నాని గారికి చెప్పినపుడు ఆయనకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పారు. ఆరునెలల పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిగింది. తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం.
నాని గారు కథ ఒప్పుకున్న తర్వాత కథలో మార్పులు ఏమైనా చేశారా ?
నాని గారికి కథ చెప్పిన తర్వాత ఆయన ఎలాంటి మార్పులు చెప్పలేదు. నేను మాత్రం కొన్ని మార్పులు చేసుకున్నాను. ప్రతి సీన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను.

నాని గారు కథ ఓకే చేశారంటే కథలో చాలా బలం వుండాలి. మీ కథలో బలం ఏమిటని భావిస్తున్నారు ?
నా ప్రధాన బలం ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం, అలానే మృణాల్ పాత్రలో వున్న బాండింగ్, అలాగే ఈ కథ అంతా దేనిపై ఆధారపడి వెళుతుందనేది కోర్ స్ట్రెంత్. ఆ ఎమోషన్ కారణంగా నాని గారు ఈ కథని ఒప్పుకున్నారని భావిస్తున్నాను.

ట్రైలర్ చూస్తుంటే హాయ్ నాన్నలో సంతోషం సినిమా ఛాయలు కనిపించాయి.. ఏదైనా స్ఫూర్తి ఉందా ?
లేదండీ. సంతోషం కంటే ముందు కుచ్ కుచ్ హోతా హై వుంది. సింగిల్ ఫాదర్ మళ్ళీ ప్రేమలో పడ్డాడని అనగానే ఈ సినిమాలన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. అయితే హాయ్ నాన్న మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుంది. ఇది ఫిక్షనల్ స్టొరీ. అయితే పూర్తిగా ఫిక్షన్ అని కూడా చెప్పలేం. జీవితంలో, సమాజంలో పరిశీలించిన అంశాలు ఇందులో వుంటాయి.

మీ తొలి సినిమాకి ప్రేమకథ రాసుకోవడానికి కారణం ?
నిజంగా చెప్పాలంటే డైరెక్షన్ తొందరగా వస్తుందని. యాక్షన్ కథలు కూడా రాశాను. అయితే తొలి చిత్ర దర్శకుడికి ప్రేమకథ అయితే నమ్ముతారు. హాయ్ నాన్న మాములు ప్రేమకథ కన్నా ఎమోషన్స్ హై పిచ్ లో ఉండే కథ. అయితే అందరికీ ప్రేమకథలే వర్క్ అవుట్ అవుతాయని చెప్పలేం. శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ని కంప్లీట్ కమర్షియల్ సినిమాగా అద్భుతంగా చేశాడు.

టీజర్ లో కథని దాచారు.. కానీ ట్రైలర్ దాదాపు గా ఓపెన్ చేయడానికి కారణం ?
ప్రేక్షకుడు ఏం చూడబోతున్నాడో, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో ట్రైలర్ చెప్పాలి. ఇక్కడ దాచుకోవడానికి ఏమీ వుండదు. ప్రేక్షకుడు ఏం చూడబోతున్నాడనేది ట్రైలర్ తోనే ప్రిపేర్ చేయాలి.

హాయ్ నాన్న అనుకున్న దానికంటే ముందు విడుదలౌతుంది కదా.. మీ వరకూ ఎంత ప్రిపేర్ గా వున్నారు?
మీరు నాకు ఇంకో రెండు నెలలు ఇచ్చినా ప్రిపేర్ గా వుండను.(నవ్వుతూ) పెర్ఫెక్షన్ కి బెటర్ మెంట్ కి అంతం లేదు. మొదట 21 అనుకున్నాం. అది ఇప్పుడు 7కి వచ్చేసరికి ఇంకా డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తున్నాం. అయితే రిలీజ్ డేట్ బట్టి ముందు మాకు ఒక ప్లాన్ వుంటుంది. ఆ ప్లాన్ అంతా రిలీజ్ డేట్ కి తగ్గట్టు ప్రీప్రోన్ అవుతుంది.

హాయ్ నాన్నతో అందరూ ప్రేమలో పడిపోతారు లేదంటే పేరు మార్చుకుంటా అని మృణాల్ అన్నారు..మీరు ఏం అంటారు.
మృణాల్ చాలా స్వీట్. సినిమాపై నమ్మకంతో ఆ మాట చెప్పారు.

ఇప్పుడంతా వైలెన్స్, గన్స్, యాక్షన్ ఇలాంటి నేపధ్యంలో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి కదా.. ఇలాంటి నేపద్యంలో ‘హాయ్ నాన్న’ తీసుకురావడం ఎలా అనిపిస్తుంది?
‘హాయ్ నాన్న’ లాంటి క్లీన్ ఎంటర్ టైనర్ చేయడానికి కారణం ఇదే. మనం చెప్పాల్సిన బలమైన ఎమోషన్ ఇదే. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, హింసలేదు. ఇది చాలా క్లీన్  ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ. న్యూక్లియర్ ఫ్యామిలీ స్టొరీ. ఎమోషనల్ గా మొద్దుబారుతున్న ఈ సమయంలో హాయ్ నాన్న లాంటి సినిమాలు రావాలి.

సింగల్ పేరెంట్ ఫాదర్ పట్ల మీ అండర్ స్టాండింగ్ ఏమిటి ?
మామూలుగా అయితే సగం భాద్యత మదర్  తీసుకుంటుంది. సింగిల్ పేరెంట్ ఫాదర్ అయితే పిల్లల విషయంలో పూర్తి బాధ్యత ఆయన మీదే వుంటుంది. పిల్లల చుట్టూ వారి జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. ఇందులో నాని గారి పాత్ర కూడా అలానే వుంటుంది. తను ఎక్కడ వున్నా ఎలా వున్న సమయానికి కూతురు దగ్గర వుండాలి. అలా తన జీవితం కూతురు చుట్టూ డిజైన్ చేయబడి వుంటుంది.

సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ చాయిస్ ఎవరిది ?
హేషమ్ ని నాని గారు సజెస్ట్ చేశారు. కథ చెప్పినపుడు చాలా ఎక్సయిట్ అయ్యారు. ఈ చిత్రానికి పాటలతో పాటు చాలా అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చారు. ఒకొక్క పాత్ర, ఎమోషన్ కి తగ్గట్టు మ్యూజిక్ చేశారు. సంగీతంతో ఆయన ఓకే కథ చెప్పుకుంటూ వచ్చారు. ఈ సినిమాతో తర్వాత ఆయన మరో మెట్టు ఎదుగుతారు. అలాగే షాను జాన్ వర్గీస్  కూడా లెన్సింగ్ నుంచి ఆయన కథ చెప్పుకుంటూ వచ్చారు. సినిమా చివరికి వెళ్లేసరికి విరాజ్ అనే పాత్ర మీకు తెలియకుండానే చాలా డిఫరెంట్ కనిపిస్తోంది.

ఓడియమ్మ పాట విక్రమ్ గారి అబ్బాయితో పాడించాలానే ఆలోచన ఎవరిది ?
ద్రువ్ నా ఫ్రెండ్. తన సంగీతం తెలుసు. పాటలు చక్కగా పాడుతాడు, మంచి గిటార్ ప్లేయర్. ఈ పాటని ద్రువ్ తో పాడిస్తే బావుంటుందనిపించింది. ఈ ఆలోచన ద్రువ్ కి కూడా చాలా నచ్చి స్వయంగా పాడారు.

మృణాల్ ఠాకూర్ ఛాయిస్ ఎవరిది ? సీతారాం తో వచ్చిన ఫేం తర్వాత ఆమెను తీసుకోవడం జరిగిందా ?

మృణాల్ ఠాకూర్ ఛాయిస్ నాదే. పాత్ర రాసినప్పుడే ఆమెను అనుకున్నాను. మృణాల్ నటించిన తుపాన్ సినిమా చూశాను. అందులో ఆమె నటన చాలా నచ్చింది. హాయ్ నాన్న లో హీరోయిన్ పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఇందులో ఏడ్చే సన్నివేశాలు చాలా వున్నాయి. అలా ఏడిస్తే కూడా ఎవరు అందంగా కనిపిస్తారని అలోచిస్తున్నప్పుడు నాకు మృణాల్ ఠాకూర్ కనిపించింది.

నాని గారు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా ?
నాని గారి ఇన్ పుట్స్ చాలా వున్నాయి. ఆయన చాలా విలువైన సజెషన్స్ ఇచ్చారు. ఓపెన్ గా మాట్లాడుకునే సినిమాకి ఏది మంచిదో చూసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని చేశాం.

పాన్ ఇండియా అంటే ఎక్కువ యాక్షన్ సినిమాలే వుంటాయి. ఒక ఎమోషనల్ లవ్ స్టొరీని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని అనిపించడానికి కారణం?
కథ అనేది యూనివర్సల్. అందరూ కథ వింటే బావుంటుందనిపిస్తుంది. పక్క భాషల వారు కూడా మన కథ వినాలనే ఉద్దేశంతో చేశాం. అన్నీ భాషల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది.

 బేబీ కియారా గురించి ?
తను సూపర్ ట్యాలెంటెడ్. చిన్నపిల్లలతో నటింపజేయడం కొంచెం కష్టమైనపనే. ఐతే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. సీన్ గురించి చెప్పి డైలాగు పేపర్ ఇవ్వగానే ఎలాంటి తడబాటు లేకుండా ఎమోషన్ ని అర్ధం చేసుకొని నటించేది. ఇప్పటికీ నిద్రలో లేపి అడిగిన తన డైలాగులన్నీ అనర్గళంగా చెప్పేస్తుంది. తనతోయాక్ట్ చేయించడానికి నేను పెద్దగా కష్టపడలేదు.

శ్రుతి హాసన్ గారి స్క్రీన్ స్పేస్ ఎలా వుంటుంది ? సర్ ప్రైజ్ పాత్రలు ఉంటాయా ?
ఇందులో శ్రుతి హాసన్ గారికి పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత వుంది. ఇప్పటివరకైతే ఆ పాత్ర గురించి ఇంత మాత్రమే చెప్పాలి.  ఒకటిరెండు సర్ప్రైజ్ పాత్రలు వుంటాయి.

హాయ్ నాన్న షూటింగ్ ఎక్కడెక్కడ జరిగింది ? ఎన్ని రోజులు జరిగింది ?
హైదరాబాద్, గోవా, ముంబై, కునూర్ లో షూటింగ్ చేశాం. 97 రోజులు షూట్ చేశాం.

నిర్మాతల సపోర్ట్ ఎలా వుంది ? వైర ఎంటర్టైన్మెంట్స్ తో జర్నీ గురించి ?
నిర్మాతలు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. మోహన్ గారు , విజయేందర్ గారు లాంటి నిర్మాతలు దొరకడం చాలా ఆనందంగా వుంది. వైర ఎంటర్టైన్మెంట్స్ తో జర్నీ చాలా మెమరబుల్. విజయేందర్ రెడ్డి గారు నాకో బ్రదర్ లాంటి వారు.వైర ఎంటర్టైన్మెంట్స్ మై హోం.

హాయ్ నాన్న మీకు సవాల్ గా అనిపించిన విషయం ఏమిటి ? మెమరబుల్ మూమెంట్స్ గురించి ?
‘హాయ్ నాన్న’లాంటి కథ చేయడమే ఒక సవాల్. చాలా సున్నితమైన కథ. దానిని మాటలతో, సన్నివేశాలతో ఎమోషన్స్ తో నిలబెట్టాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలి. ఇలాంటి కథను రాయడం ఒక సవాల్. ఇక చాలా మెమరబుల్ మూమెంట్స్ వున్నాయి. నాని గారు, మృణాల్, బేబీ కియరా తో ప్రతి సన్నివేశానికి ముందు ప్రిపేర్ అయ్యే విధానం చాలా మెమరబుల్ అనిపించింది.

దర్శకుడు కావడానికి మీకు స్ఫూర్తి ఎవరు ?
రాజమౌళి గారు. ఆయన సినిమాలు చూస్తూ చాలా స్ఫూర్తి పొందాను. ప్రతి ఔత్సహిక దర్శకుడికి ఆయన రోల్ మోడల్.

భవిష్యత్ ఎలాంటి కథలు చేయాలనుకుంటున్నారు? మీ బలం ఏమిటి ?
కొన్ని కథలు వున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత కొంత సమయం తీసుకొని ఆలోచిస్తాను. నా బలం ఎమోషన్. కమర్షియల్ సినిమాల్లో కూడా ఎమోషనే కీలకం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus