‘గీత గోవిందం’ మూవీ తరువాత సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. దీని తరువాత వరుస సినిమాలతో వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో ఏ ఒక్క సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. తనకి బాగా కలిసొచ్చిన రశ్మికతో జంటగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ ట్రై చేసినా కూడా సరైన ఫలితం దక్కలేదు. రీసెంట్ గా వచ్చిన ‘కింగ్డమ్’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్టులపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు విజయ్.
ప్రస్తుతం ఈ హీరో, రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ఒక మూవీలో నటిస్తుండగా, రవి కిరణ్ కోలా డైరెక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. రాహుల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనుండగా, దాంట్లో నటీనటులను కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం.
హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘మమ్మీ’ మూవీలో విలన్ గా నటించిన నటుడు ‘ఆర్నాల్డ్ ఓస్లో’, విజయ్ మూవీ లో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడట. ఈయన బ్రిటిష్ అధికారి పాత్రలో చేస్తుండగా, విజయ్ కి ఆర్నాల్డ్ కి మధ్య భారీ సన్నివేశాలు ఉంటాయని టాక్. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని పాశమైలారంలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలోనే తెలియజేయనుందట.