90’s వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యింది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఎపిసోడ్, ప్రతి సీన్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్ “హోమ్ టౌన్” (Home Town). నవీన్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా, ప్రజ్వల్ యద్మ లీడ్ గా పరిచయమైన ఈ సిరీస్ ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్ కూడా 90’s స్థాయిలో ఆకట్టుకోగలిదిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: ఎట్టి పరిస్థితుల్లోనూ కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ యద్మ)ను పెద్ద చదువులు కోసం అమెరికా పంపించాలి అనేది తండ్రి (రాజీవ్ కనకాల) కల. అందుకోసం చిన్నప్పటినుంచే పాలసీ కూడా కడతాడు. కట్ చేస్తే.. శ్రీకాంత్ కి చదువు తప్ప అన్నీ ఇంట్రెస్టే. ఇంజనీరింగ్ పూర్తిచేసేసరికి సినిమా తీయడం వైపు మర్లుతుంది శ్రీకాంత్ ధ్యాస.
తండ్రికి తన ధ్యేయం ఏమిటనేది చెప్పి ఒప్పించగలిగాడా? ఈ క్రమంలో అతడు తెలుసుకున్న సత్యం ఏమిటి? అనేది “హోమ్ టౌన్” కథాంశం.
నటీనటుల పనితీరు: రాజీవ్ కనకాల ఈ సిరీస్ కి తనదైన నటనతో ఒక ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాడు. తెలంగాణ యాసలో ఆయన వాచకం, మధ్యతరగతి తండ్రిగా ఆయన బాడీ లాంగ్వేజ్ చూడముచ్చటగా ఉన్నాయి. అలాగే.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అన్నీ రాజీవ్ కనకాల పాత్రలో ఉన్నాయి. అలాగే ఝాన్సీ కూడా తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. ఆమె కళ్లతో పండించిన చాలా భావాలు హృద్యంగా ఉన్నాయి.
ప్రజ్వల్ లో ఒక చురుకుదనం ఉంది. కామెడీ & ఎమోషన్స్ ను సమానంగా పండించగలిగాడు. ముఖ్యంగా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకునే కొడుకుగా ప్రజ్వల్ నటనకు చాలామంది రిలేట్ అవుతారు. స్నేహితులుగా అనిరుధ్ & సాయిరాం పాత్రల ద్వారా మంచి ఆరోగ్యకరమైన హాస్యం పండింది. ముఖ్యంగా సాయిరాం అమాయకత్వం కడుపుబ్బ నవ్విస్తుంది.
మంచి వెయిటేజ్ ఉన్న పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ టర్నడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చక్కగా ఒదిగిపోయింది. క్లైమాక్స్ లో ఆమె పాత్ర ద్వారా అందించిన మెసేజ్ బాగా వర్కవుట్ అయ్యింది. చిన్న పాత్ర అయినప్పటికీ శ్రావ్య ముస్లిం అమ్మాయిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ “90’s”తో హిట్ కొట్టి ఉండడం, దాదాపుగా ఆ బృందమే ఈ సిరీస్ కి కూడా వర్క్ చేసి ఉండడంతో, “హోమ్ టౌన్” మేకింగ్ మీద ఆ ప్రభావం గట్టిగా కనిపించింది. కలర్ ప్యాలెట్ మొదలుకొని, బ్యాగ్రౌండ్ స్కోర్ వరకు ఆ సిమిలారిటీస్ కనిపించాయి.
అయితే.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం మాత్రం సిరీస్ లోని ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడింది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. డి.ఐ విషయంలో ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ కోసం ఖర్చు చేసి ఉంటే బాగుండేది అనిపించింది.
దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లె “హోమ్ టౌన్” కోసం ఎంచుకున్న పాయింట్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా ఎంగేజ్ చేసే ఓ భావోద్వేగం అనేది మిస్ అవ్వడంతో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా 4వ ఎపిసోడ్ ను ఫేస్బుక్ ప్రధానాంశంగా సాగదీసిన విధానం సిరీస్ కి ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యేలా చేసింది. అయితే.. ఎండింగ్ మాత్రం డీసెంట్ గా ఉండడంతో ఓవరాల్ గా బొటాబోటి మార్కులతో పాసయ్యాడు శ్రీకాంత్ రెడ్డి. ఇదేదో “90’s” సిరీస్ తో కంపేర్ చేస్తూ చెప్తున్న మాట కాదు, కేవలం ఈ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని చెబుతున్న విషయం.
విశ్లేషణ: ఒక సినిమా లేదా సిరీస్ లోని పాత్రల తాలూకు ప్రయాణంలో ప్రేక్షకులు లీనమవ్వాలి. అప్పుడే ప్రేక్షకులు సదరు సిరీస్ లేదా సినిమాలోని ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యి, ఆ పాత్ర తాలూకు భావోద్వేగాలకు రియాక్ట్ అవుతారు. “హోమ్ టౌన్” (Home Town) సిరీస్ లో ఆది మిస్ అయ్యింది. అందువల్ల స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ & క్లైమాక్స్ కి తప్ప పెద్దగా దేనికీ కనెక్ట్ అవ్వలేం. ఈ కారణంగా “హోమ్ టౌన్” (Home Town) అనేది ఓ రెగ్యులర్ సిరీస్ లా మిగిలిపోయింది కానీ.. ఆశించిన స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. అయితే.. ఎలాంటి ఇబ్బందికరమైన డైలాగ్స్ కానీ, సన్నివేశాలు కానీ లేని ఈ సిరీస్ ను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా ఎక్కడా కళ్లు కానీ చెవులు కానీ మూసుకోకుండా చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: సొంతూర్లో లోపించిన స్వచ్ఛత!
రేటింగ్: 2/5