సినిమా షూటింగ్ మొదలుపెట్టకుండానే ఇంకా చెప్పాలంటే ఎప్పుడు చిత్రీకరణ మొదలవుతుంది అనే విషయం తెలియకుండానే.. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన వాళ్లను ఏమనాలి. మామూలుగా అయితే ఆత్రం బ్యాచ్ అనొచ్చు. ఎందుకంటే ఎంత పక్కా ప్లానింగ్ వేసుకున్నా అనుకున్న సమయానికి టాలీవుడ్ సినిమాలు పూర్తి కావు అనే మా చెడ్డ గొప్ప పేరు ఉంది. అలాంటి ఆత్రాన్ని ప్రదర్శిస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసింది #SSMB28 టీమ్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమాను తీసుకొస్తాం అని చెప్పేసింది.
మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా ఉంది అంటూ తొలుత పుకార్లుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత కన్ఫామ్ అయ్యింది. దీని కోసం టీమ్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది కూడా. 11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ సినిమా అంటూ ఘనంగా అందులో చెప్పింది కూడా. అయితే ఆ తర్వాత సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమా ఆగిందేమో అనే ప్రచారం సాగింది. మళ్లీ ఉంది అని చెప్పారు. ఇలా సినిమా లేదేమో అన్నప్పుడల్లా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఉంటుంది టీమ్. ఇప్పుడు ఏకంగా రిలీజ్ డేట్తోనే వచ్చేసింది.
#SSMB28 సినిమా ఈ పాటికే షూటింగ్ మొదలై ఓ రెండు షెడ్యూల్స్ అయిపోవాలి. అయితే కథ ఇంకా ఫైనల్ కాలేదని కొన్ని రోజులు, మార్పులు ఉన్నాయని మరికొన్ని రోజులు, కాస్టింగ్ అంటూ ఇంకొన్ని రోజులు లేట్ చేశారు. ఇప్పుడు ఏకంగా షూటింగ్‌లే ఆగిపోయాయి. ఇలా కారణం ఏదైనా సినిమా షూటింగ్ జూన్, జులై, ఆగస్టు అంటూ ఇప్పుడు సెప్టెంబరుకి వెళ్లింది. ఆ లెక్కన వచ్చే నెల చిత్రీకరణ మొదలైతే.. రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్‌కి ఎనిమిది నెలలు ఉంది.
మామూలుగా అయితే ఎనిమిది నెలల్లో ఓ స్టార్ హీరో సినిమా తెరకెక్కించేయొచ్చు. కానీ అక్కడున్నది మహేష్, త్రివిక్రమ్. వీళ్ల నుండి ఓ సినిమా అంత వేగంగా బయటకు రావడం అరుదు అంటుంటారు. సినిమా చిత్రీకరణలో త్రివిక్రమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లు రాకపోతే రీషూట్లు పక్కా. అలా కాకుండా రాజీ పడితే సినిమా రిజల్ట్ హులక్కే. ఇక మహేష్ సంగతి చూస్తే.. రెండు నెలలు షూట్, ఒక నెల గ్యాప్ అనేలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల్లో సినిమా పూర్తవుతుందా అనేది ప్రశ్న.
నిజానికి అక్కడ ఉన్నది ఏడు నెలలే. ఎందుకంటే ఏప్రిల్ అంతా ప్రచారం చేసుకోవాలి. అంటే మార్చి 31 కల్లా సినిమా పూర్తవ్వాలి. అయితే ఇంత కంగారుగా డేట్ ఎందుకు చెప్పేశారు అనేగా.. ఆ డేట్ మీద మరికొంతమంది స్టార్ హీరోల చూపు పడిందని, అందుకే ముందుగా అనౌన్స్ చేసి ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు.