నందమూరి బాలకృష్ణ (Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎంట్రీని చూఛాయగా అనౌన్స్ చేసింది ఎనిమిదేళ్ల క్రితం కాబట్టి. బయటకు తెలియని అవాంతరాలను దాటుకుని ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా సినిమాను ముహూర్తం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదే బడ్జెట్. మోక్షజ్ఞ తొలి సినిమా సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కనుంది.
ఆయన సోదరి తేజస్విని నిర్మాతగా ఆ సినిమా ఉంటుంది అని ఇప్పటికే చెప్పారు. దాంతోపాటు వేరే నిర్మాణ సంస్థ కూడా సాయం చేస్తుందని టాక్. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం బాలయ్య రూ. 100 కోట్లు పెట్టడానికి ఓకే అయ్యారట. సినిమా ప్రారంభం రోజే ఈ విషయం చెబుతారు అని అంటున్నారు. ‘హను – మాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాను హ్యాండిల్ చేయనున్నారు.
ఆయన సిద్ధం చేసుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చారు. ఇతిహాసాల్లోని సూపర్ హీరోగా మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు అని బాలయ్య ఇప్పటికే చెప్పాడు కూడా. ‘హను – మాన్’ (Hanuman) తరహాలోనే ఫాంటసీ టచ్ ఉన్న సినిమాకు భారీగా ఖర్చు అవుతుందని, కాస్టింగ్ అండ్ క్రూ పాన్ ఇండియా లెవల్‌లో ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఖర్చు తప్పదు అని అంటున్నారు.
మరి తొలి సినిమాకే అంత బడ్జెట్ రిస్కా? లేక మోక్షజ్ఞ టాలెంట్‌కు అది సర్వసాధారణమైన విషయమా? అనేది సినిమా వస్తే కానీ తెలియదు. మరి ‘సింబా’ ఎలా నటిస్తాడు? ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరమే. బాలయ్యను టాలీవుడ్ జనాలు, అభిమానులు ముద్దుగా సింహం అంటుంటారు. మరి సింహం తనయుడు కాబట్టి ‘సింబా’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చేశారు ప్రశాంత్ వర్మ. సినిమా వచ్చేనాటి ఏ ట్యాగ్‌లైన్ ఉంటుంది అనేదీ ఆసక్తికరమే.