అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి ప్రాజెక్టుల కోసం భారీ బడ్జెట్ తో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ (Thandel) చిత్రీకరణ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమా, నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు, చైతన్య లుక్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
‘తండేల్’ పూర్తి కాగానే, నాగచైతన్య విరూపాక్ష (Virupaksha) దర్శకుడు కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో మరో భారీ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుందని సమాచారం. ఇందులో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) , పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికలుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రాగానే ఈ ప్రాజెక్ట్ మీద మరింత బజ్ పెరగడం ఖాయం.
ఈ మిస్టిక్ థ్రిల్లర్‌కి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) సుమారు 110 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసం 30 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారట. ఇది తెలుగులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలలో అత్యంత అధునాతనమైన గ్రాఫిక్స్ తో రూపొందనున్న చిత్రంగా నిలవబోతోంది. గ్రాఫిక్స్ పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు హాలీవుడ్ టీమ్‌ను కూడా నియమించినట్లు తెలిసింది.
సినిమా కథ ఒక యూనిక్ కాన్సెప్ట్‌గా ఉండబోతోందని సమాచారం. ప్రధానంగా ఉత్తర భారతదేశం, కొన్ని ప్రత్యేకమైన లొకేషన్లలో షూటింగ్ చేయనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. కథకు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్‌తో పాటు ప్రతీ అంశాన్ని అత్యున్నతంగా రూపొందించనున్నారు. నాగచైతన్య తన కెరీర్‌లో ఇదే భారీ ప్రాజెక్ట్ కావడంతో, ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి.