సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో మూవీ కోసం అబుదాబిలో యాక్షన్ సీన్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ కోసం 70 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో మరో తెలుగు సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ మూవీ ఇంకేదో కాదు మెగాస్టార్ చిరంజీవి తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గా కనిపించబోతున్న” సైరా నరసింహా రెడ్డి”. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు నగర శివార్లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. తాజాగా ‘జార్జియా’లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత శనివారం రోజున అక్కడ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దాదాపు 20 రోజుల పాటు అక్కడ భారీస్థాయిలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
జార్జియాలోని విశాలమైన ప్రాంతంలో ఈ యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేశారు. వందలాది గుర్రాలతో వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి కథ కావడం వలన విదేశీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో అవసరం కావడంతో అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందువలన కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 50 కోట్ల వరకూ ఖర్చు అవుతోందని చెబుతున్నారు. ఈ సీన్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం తెలిపింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.