దగ్గుబాటి రానా నటించిన ‘అరణ్య’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు ప్రభు సాల్మన్. అడవులు, అక్కడి జంతువుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రానా కెరీర్ లో ఓ స్పెషల్ సినిమా అవుతుందని అభిమానులు భావించారు. కానీ మార్చిలో విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగు, తమిళ భాషల నుంచి ఎలాంటి రెవెన్యూ రాబట్టని ఈ సినిమా నిర్మాత సంస్థ ఈరోస్ కి పెద్ద షాకిచ్చింది.
అయితే హిందీలో ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేశారు కానీ.. సెకండ్ వేవ్ కారణంగా ఉత్తరాదిన థియేటర్లు చాలా వరకు మూతపడడంతో హిందీ వెర్షన్ రిలీజ్ ఆపాల్సిన పరిస్థితి కలిగింది. తెలుగు, తమిళంలో సినిమా డిజాస్టర్ కావడం, హిందీ మార్కెట్ పరిస్థితి అసలేమాత్రం బాగా లేకపోవడంతో ఈ సినిమాను నార్త్ లో రిలీజ్ చేయలేకపోయారు. దీంతో ‘అరణ్య’ థియేట్రికల్ రెవెన్యూ దాదాపు జీరో అయిపోయింది. ఇప్పుడిక హిందీ వెర్షన్ ను ఓటీటీ ద్వారా నామమాత్రంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది ఈరోస్ సంస్థ.
ఈ నెల 18న జీ సినిమా, ఈరోస్ ఓటీటీల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ డిజాస్టర్ మూవీకి హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!