బాహుబలి బిగినింగ్ సృష్టించిన రికార్డులను కంక్లూజన్ సునాయాసంగా తుడిచి వేస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకోకముందే బిజినెస్ ని కంప్లీట్ చేస్తోంది. ఓ వైపు ఈ చిత్రం థియేటర్ హక్కులను సొంతం చేసుకునేందుకు సంప్రదింపులు జరుగుతుండగానే.. హిందీ శాటిలైట్ హక్కులు అమ్మకాలు జరిగిపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ సోనీ వారు బాహుబలి కంక్లూజన్ హిందీ శాటిలైట్ హక్కులను 51 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ వ్యాపార ఒప్పందానికి కట్టాల్సిన ట్యాక్స్ ని కూడా ఛానెల్ వారే భరించనున్నట్లు అగ్రిమెంట్ పూర్తి అయింది.
ట్యాక్స్ తో పాటు కలుపుకుంటే మొత్తం 56 కోట్లు అయిందని ఛానల్ యాజమాన్యం పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఒక తెలుగు సినిమాను ఇంత మొత్తంలో ఏ ఛానెళ్ల వాళ్లు కొనుగోలు చేయలేదు. బాహుబలి 1, 2 తెలుగు శాటిలైట్ హక్కులను గత ఏడాదే మాటీవీ వారు 25 కోట్లు చెల్లించి దక్కించుకున్నారు. రెండు సినిమాలకంటే బాహుబలి రెండో భాగమే 56 కోట్లు పలికి రికార్డ్ నమోదు చేసింది. ప్రపంచంలోని సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదలకు ముస్తాబు అవుతోంది.