యువహీరో నిఖిల్ హిట్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ చిత్రంతో నందిత శ్వేత తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ‘అమల’గా నటించిన నందితకి మంచి పేరు వచ్చింది. దీంతో తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. తమిళంలో అనేక సినిమాలు ఒప్పుకొని ఉండడంతో ఇక్కడ నటించడానికి కుదర్లేదు. ఇన్ని రోజులకు మళ్లీ తెలుగు చిత్రానికి సైన్ చేసింది. నితిన్‌తో “శ్రీనివాస కళ్యాణం”లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు చెప్పింది. “నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. అసలు పేరు శ్వేత.
అయితే కన్నడంలో తొలిసారి నటించిన “నందా లవ్స్ నందిత” చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమాలోని పాత్ర పేరును నా పేరు ముందు పెట్టుకున్నాను.” అని పేరు వెనుక రహస్యాన్ని బయటపెట్టింది. ఇక సినిమాల్లో రావడానికి తాను పడిన కష్టాన్ని వివరిస్తూ.. “సినిమాల్లో నటిస్తానని నేను చెప్పినప్పుడు అమ్మానాన్నా అస్సలు ఒప్పుకోలేదు. దీంతో కోపంతో నా గదిలోకి వెళ్లి గొళ్లెం పెట్టుకుని కూర్చున్నాను. మూడు రోజులు ఏమి తినకుండా నిరసన తెలిపాను. నా మొండి పట్టుదల చూసి పేరెంట్స్ ఒప్పుకున్నారు” అని నందిత శ్వేత చెప్పింది.