సింగర్ గా కంటే ప్రముఖ నటీమణి సమంతకు డబ్బింగ్ చెప్పే అమ్మాయిగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొన్న చిన్మయి శ్రీపాదకు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆదివారం ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనను అసభ్యంగా పట్టుకున్నాడట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘నిన్న జరిగిన కార్యక్రమంలో ఓ వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. ఈ కథను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. నన్ను షాక్‌కు గురి చేసిన విషయం ఏంటంటే..చిన్నతనంలో ఎంత మంది లైంగిక వేధింపులకు గురై ఉంటారో..! సొంత ఇంట్లో, బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో వేధింపులు ఎదుర్కొంటున్నారు.
చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమకు జరిగిన వేధింపుల గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పడం లేదు. ఎందుకంటే ఎవరూ నమ్మరు కాబట్టి. అమ్మాయిలు చెబితే నమ్ముతారేమో కానీ అబ్బాయిలు చెబితే ఎవరూ నమ్మరు. చిన్నతనంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి అబ్బాయిలు చెబితే వారిని హేళన చేస్తారు. అమ్మాయిలు ధైర్యం చేసుకుని చెబితే.. వారిని తప్పుబడతారు. నీ దుస్తులు, లుక్ అలా ఉన్నాయి కాబట్టే వేధించారు అంటూ బాధిత మహిళను మరో మహిళ అనడం చాలా బాధాకరం. బాధితురాలితో ఎలా ఉండాలనే విషయంలో మహిళకు శిక్షణ అవసరం.’
‘చదువు ఆపేస్తారేమో?, ఉద్యోగం వద్దని ఇంట్లోనే ఉండమంటారేమో? అనే సందేహంతో కొంత మంది అమ్మాయిలు వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడుతున్నారు. దయచేసి బాధితులను వారి లిప్‌స్టిక్, జుట్టు, శరీర రంగు, దుస్తులు, వైఖరి, నైపుణ్యం, తెలివి తదితర విషయాల్లో హేళన చేయడం ఆపండి. చాలా మంది అబ్బాయిలు కూడా వేధింపులకు గురవుతున్నారు. వీరందరికీ మద్దతు కావాలని అర్థం చేసుకోండి. హేళన చేయకండి. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు చిన్మయి.
చిన్మయి గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. గతేడాది ఆమె న్యూయార్క్ వెళ్లినప్పుడు తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు నుంచి కొన్ని వస్తువులు దొంగతనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.