శనివారం విడుదలైన “కింగ్డమ్” ట్రైలర్లో కానీ, టీజర్ లో కానీ ఒక నటుడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. టీజర్ లో బుల్లెట్ కు సైతం భయపడని క్యూరియస్ పర్సన్ గా కనిపించిన అతడు, ట్రైలర్ లో మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ నటుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? వంటి ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ లో ఎక్కడా కనిపించకపోవడంతో అతనెవరు అనేది ఎవరికీ తెలియలేదు.
అయితే.. ఆ యాక్టర్ ఎవరు అనేది స్వయంగా అతనే రివీల్ చేసుకున్నాడు. నటుడు/దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్రైలర్ లో విలన్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి “ఎవరితను, ఇతని కోసం చూస్తాను” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఆ యాక్టర్ స్వయంగా రిప్లై ఇవ్వడంతో అతను ఎవరు అనేది క్లారిటీ వచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో ఆల్రెడీ దాదాపు 10 సినిమాలు చేసిన అతడి పేరు వెంకిటేష్ విపి. చూడ్డానికి జూనియర్ సూర్యలా ఉన్న వెంకిటేష్ స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉంది. ఉన్న షాట్స్ తక్కువే అయినప్పటికీ.. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు.
సినిమా సక్సెస్ అయితే గనుక.. వెంకిటేష్ తెలుగులో వరుస ఆఫర్లు అందుకోవడం ఖాయం. జూలై 31న విడుదలవుతున్న “కింగ్డమ్” మీద అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇక ఇవాళ (జూలై 28) అనిరుధ్ హైదరాబాద్ లో లైవ్ పెర్ఫార్మ్ చేయనుండడం అనేది సినిమాకి మంచి బూస్ట్ ఇస్తుంది. గౌతమ్ మేకింగ్ మీద అందరికీ మంచి నమ్మకం ఉంటుంది, ఇక నాగవంశీ తన శాయశక్తులా సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తాడు. సో, 30వ తారీఖున ప్రీమియర్ షోస్ వేసి, దానికి పాజిటివ్ టాక్ వస్తే గనుక సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. హిట్ కోసం విజయ్ దేవరకొండ ఎదురుచూపులు “కింగ్డమ్”తో ముగుస్తాయేమో చూడాలి.