ప్రముఖ మలయాళ నటుడు, మాజీ లోక్సభ ఎంపీ ఇన్నోసెంట్ థెక్కెతలా (75) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలముకుంది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మార్చి 3 నుండి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్సోసెంట్ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి ఆదివారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు.
ఇన్నసెంట్‌కు గతంలో కరోనా సోకింది. ఆ తర్వాత కోలుకున్నా ఆ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులతోపాటు వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇన్నోసెంట్ గతంలో లోక్సభ ఎంపీగా సేవలందించారు. 2014 – 2019 మధ్య కాలంలో ఆయన ఎంపీగా చేశారు. ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. మూడేళ్ల తర్వాత ఆ వ్యాధిని అధిగమించానని కూడా ప్రకటించారు. ఆ తర్వాత క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తెలియజేస్తూ.. తన పుస్తకం ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’ రాశారు.
1972లో కమెడియన్గా నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇన్నోసెంట్ త్రిసూర్ జిల్లాలోని చలకుడి నియోజకవర్గం నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బెన్నీ బెహనాన్ చేతిలో ఓడిపోయారు. నటుడిగా ఆఖరిగా ‘పచువుమ్ అత్బుతవిలక్కుమ్’ సినిమాలో కనిపించారు. అయితే ఇన్నోసెంట్ కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. కొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.
ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ప్రత్యేకమైన నటనా శైలితో ఇన్నోసెంట్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని సీఎం కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కూడా కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు.