“సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) అనే టైటిల్ ప్రకటించినప్పట్నుండి ఏంటీ “శనివారం” అని అడగని, ఆలోచించని తెలుగు సినిమా అభిమాని ఉండడు. సినిమా విడుదలైన తర్వాత కూడా ఈ శనివారం స్పెషల్ ఎందుకబ్బా అని అందరూ తెగ ఆలోచించేశారు. అయితే.. ఈ శనివారం అనేది ఎందుకంత స్పెషల్ అనేది వివేక్ ఆత్రేయ (Vivek Athreya) నిన్న ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ చేశాడు. అసలు శనివారం స్పెషాలిటీ ఏంటంటే.. వివేక్ ఆత్రేయ తండ్రికి శనివారం అంటే చాలా ఇష్టమట, ప్రతి శనివారం లాల్చి జుబ్బా వేసుకొని చాలా ప్రత్యేకంగా ఉండేవారట.
ఆఖరికి ఆయన చనిపోయింది కూడా శనివారమేనట. అందుకే.. సినిమా “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) అనే టైటిల్ పెట్టుకున్నానని వివేక్ ఆత్రేయ వివరించాడు. అదే సందర్భంలో.. తన తండ్రి మరణం తర్వాత ఏ విషయానికీ పెద్దగా రియాక్ట్ అవ్వడం మానేశారని, తన కొడుకు అకీరా పుట్టిన తర్వాతే మళ్ళీ కాస్త ఎగ్జైట్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు వివేక్. సో, “సరిపోదా శనివారం” టైటిల్ వెనుక కథ అవసరంతోపాటు.. వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉందన్నమాట.
ఇకపోతే.. “సరిపోదా శనివారం” 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరి నాని కెరీర్లో “దసరా” (Dasara) రెండో ‘2 మిలియన్ డాలర్’ సినిమాగా నిలిచింది. అలాగే.. నాని (Nani) కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచే అవకాశం కూడా ఈ చిత్రానికి ఉంది. నిన్నమొన్నటివరకు భారీ వరదల్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు వరదలు తగ్గు ముఖం పడుతున్న తరుణంలో మరింత పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
అలాగే.. ఈ చిత్రం నాని కెరీర్ లో రెండో వంద కోట్ల సినిమాగా నిలవగలుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే.. “దసరా” సినిమా కంటే.. “సరిపోదా శనివారం”కి మంచి రివ్యూలు & ఆడియన్స్ రిసెప్షన్ వచ్చింది. అలాంటప్పుడు ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం అనేది ఈజీ అని చెప్పాలి.