వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రధాన పాత్రల్లో ఈ రోజు విడుదల కాబోతున్న చిత్రం ‘నింద’ (Nindha) . ఈ సినిమా దర్శకుడు రాజేశ్ జగన్నాథం. పేరు వినగానే ఎవరో కొత్త దర్శకుడు అని అర్థమైపోతుంది. అయితే ఈయన చాలామందిలా దర్శకుల వల్ల డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చాలా ఏళ్లుగా పని చేసి ఇప్పుడు సినిమాల్లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. రాజేశ్ జగన్నాథం సొంతూరు నర్సాపురం.
అమెరికాలో 12 ఏళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత యూఎస్‌ఏలోనే సినిమా మేకింగ్ గురించి చదువుకున్నారు. ఆ వెంటనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారు. చాలా ఏళ్లుగా సినిమాలపై ఉన్న తపనతో తిరిగొచ్చి ప్రయత్నాలు చేశారు. అలా ‘నింద’ సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు సినిమా విడుదలైంది. అయితే బడ్జెట్ పరిమితుల్ని వల్ల తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేశానని, తర్వాతి సినిమాలు భారీగానే ఉంటాయి అని చెప్పారు రాజేశ్.
యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ‘నింద’ కథ రాసుకున్నారట. ఓ కల్పిత కథతోనే సినిమాను తెరకెక్కించామని చెప్పిన ఆయన.. కాండ్రకోట మిస్టరీ అని లైన్ చూసి ఇదేదో దెయ్యం కథ అని కొంతమంది అనుకున్నారని చెప్పారు దర్శకుడు. అయితే ఈ సినిమా కథ అంతా ఓ నేరం చుట్టూ తిరుగుతుందని తెలిపారు. వరుణ్ సందేశ్‌తో ఈ సినిమా చేయడానికి ఆయన మాత్రమే సరిపోతాడు అనే నమ్మకమే కారణమని అన్నారు దర్శకుడు.
హీరో ఎవరైనా సరే… కథ బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడని చెప్పిన రాజేశ్ జగన్నాథం.. ‘నింద’ సినిమా అలాంటిదే అని చెప్పారు. మరి చాలా నెలలుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ సందేశ్‌కు మరి రాజేశ్ జగన్నాథం ఏమన్నా విజయం అందిస్తారేమో చూడాలి. సరైన సినిమా తీస్తే ఆయనకు కూడా వరుస ఛాన్స్‌లు వస్తాయి. సో ఇద్దరికీ ఈ సినిమా చాలా కీలకం అని చెప్పొచ్చు.