సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో డిజాస్టర్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ వాటిలో ‘టక్కరి దొంగ’ ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ ‘స్పైడర్’ వంటి సినిమాలకు ఓ గౌరవం కూడా ఉంది. మహేష్ బాబు కొత్తగా ప్రయత్నించాడు అనే ప్రశంసలు కూడా దక్కాయి. అయితే ఒక డిజాస్టర్ సినిమా మాత్రం మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది అని చెప్పాలి. ఆ సినిమా మరేదో కాదు ‘వంశీ’. సీనియర్ స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్ పై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మించారు.
వాస్తవానికి ‘వంశీ’ సినిమాకి బదులు సముద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి మహేష్ బాబు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దీంతో హడావిడి హడావిడిగా ‘వంశీ’ కథని ఓకే చేశారు కృష్ణ. ఈ సినిమా కథ మహేష్ బాబుకి నచ్చలేదట. ఎందుకంటే ఈ సినిమా కథలో మహేష్ బాబు పాత్రకు ప్రాముఖ్యత ఉండదు. మహేష్ బాబు పేరుకే హీరో. ఈ సినిమాలో కథ మొత్తం కృష్ణ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మహేష్ బాబు జస్ట్ సెకండ్ హీరోలా ఉంటాడు. ‘మేజర్ చంద్రకాంత్’ లో మోహన్ బాబు మాదిరి అనమాట. అందుకే ఈ సినిమా అభిమానులను సైతం రంజింపజేయలేదు. బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అయితే ఇష్టం లేకుండా చేసినా.. సినిమా ఫలితం తేడా కొట్టినా.. ‘వంశీ’ మాత్రం మహేష్ బాబు కెరీర్ ను టర్న్ చేసిందట. ఎలా అంటే ఈ సినిమా వల్ల మహేష్ బాబుకి నమ్రతతో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారి డేటింగ్ వరకు వెళ్ళింది. రెండేళ్ల డేటింగ్ అనంతరం వీరు పెద్దలను ఒప్పించి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు కెరీర్ ను గనుక పరిశీలిస్తే.. నమ్రతని పెళ్లి చేసుకోక ముందు.. పెళ్లి చేసుకున్న తర్వాత అని చెప్పాలి. అతని లైఫ్ స్టైల్ ని, లుక్స్ ని కంప్లీట్ గా మార్చేశారు నమ్రత. ఆ తర్వాత మహేష్ బాబు స్టార్ డమ్ కూడా పెరిగింది. సో ‘వంశీ’ సినిమా అనేది కూడా మహేష్ బాబుకు చాలా స్పెషల్ మూవీ.నేటితో ఆ సినిమా విడుదలై 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.2000వ సంవత్సరం అక్టోబర్ 4న ఆ సినిమా రిలీజ్ అయ్యింది.