థియేటర్లలో వచ్చిన సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలి. ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉందికదా.. వినే ఉంటారు లెండి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం సినిమా పరిశ్రమలోని యాక్టివ్ నిర్మాతలు (ఆ పేరు పెట్టుకున్నారు లెండి) అందరూ కలసి సినిమా షూటింగ్‌లు ఆపేసి మరీ రోజుల తరవడి చర్చించి తీసుకున్న నిర్ణయమది. అయితే దానిని పాటిస్తున్నారా అంటే ఆ విషయం ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే రెండు పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు ఈ ఫార్ములాను దాటి ఓటీటీలకు వచ్చేస్తున్నాయి మరి.
నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫలితం బాగా రాని సినిమాల విషయంలో పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే థియేటర్ల నుండి ఆ సినిమా వేగంగా తిరిగి నిర్మాత ఇంటికి వెళ్లిపోతుంది కాబట్టి ఓటీటీలోకి వచ్చేయొచ్చు. అదే హిట్ సినిమా, రూ. వందల కోట్లు వసూళ్లు చేసిన సినిమా విషయంలో కూడా ఇలానే ఆలోచిస్తే ఎలా? తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ‘మిరాయ్’ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. అక్టోబరు 10 నుండి ఈ సినిమాను ఓటీటీలో చూసేయొచ్చు.
అంతేకాదు, ఈ సినిమా స్టైల్‌లోనే ‘ఓజీ’ సినిమాను కూడా ఈ నెలాఖరు నుండి ఓటీటీలోకి తీసుకొచ్చేస్తారనే చర్చ మొదలైంది. దీనికి కారణం ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులు కొన్న ఓటీటీ సంస్థలు ముందుగానే ఈ డేట్ కండిషన్ పెట్టి సినిమాను కొనుక్కున్నాయట. అని అంటున్నారు. దీపావళి సందర్భంగా తమ ఓటీటీలోకి ‘ఓజీ’ రాబోతున్నాడు అనే ప్రచారంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను 192 దేశాలకు పరిచయం చేయనుంది అని సమాచారం.
ఇక ‘మిరాయ్’ సినిమాను జియో హాట్‌స్టార్ కూడా భారీ ప్లానింగ్ వేసుకుందట. ఇదంతా ఓకే కానీ.. థియేటర్లలో సినిమా ఉన్నప్పుడే ఇలాంటి లీక్‌లు వస్తే థియేట్రికల్ రన్ ఇబ్బందిపడుతుంది. ‘మిరాయ్’ సినిమాను తక్కువ రేటుకే ఇప్పుడు థియేటర్లలో వేస్తున్నారు మరి.