‘పుష్ప’ సినిమా టైటిల్‌ని ప్రాజెక్ట్ పనులు చాలా రోజులు అయిన తర్వాతే అనౌన్స్ చేశారు. అమ్మాయి పేరులా ఉందేంటి అని కొంతమంది సణిగినా ‘పుష్ప’రాజ్ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఆ సినిమా పేరును సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే అల్లు అర్జున్ ఎక్స్ (అప్పట్లో ట్విటర్)లో చెప్పేశాడు. ఏదో విదేశీ భాషలో అక్షరాలను PUSHPA అని వచ్చేలా ఆ పోస్టు (అప్పట్లో ట్వీట్)లో రాసుకొచ్చాడు. అయితే అప్పడు దానిని ఎవరూ పట్టించుకోలేదు. చాలా రోజుల తర్వాత సినిమా విడుదలకు ముందు ఈ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తన కొత్త సినిమా అదేనండీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం అవుతుంది అని చెబుతున్న సినిమా విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశారు. మరి ఈ ఆలోచన బన్నీదా, లేక లోకీదా.. వీరిద్దరూ కాకుండా సంగీత దర్శకుడు అనిరుధ్‌దా అనేది తెలియదు కానీ.. టీజర్‌లో బ్యాగ్రౌండ్‌లో వినిపించిన పాటలో ఈ సినిమా అల్లు అర్జున్ 23వ సినిమా అని. లోకేశ్ కనగరాజ్‌తో లాక్ అయిందని, చాలా సులభంగా ప్రాజెక్ట్ రెడీ అయింది అని చెప్పే ప్రయత్నం చేశారు.
You aint stoppin me.. Step aside.. I say 23.. Goin on a spree.. You jus set me free.. Vip.. Walk in easily.. Win so casually.. Loki G.. Locked in mentally.. Thats a guarantee.. Talk to me.. Numbers never lie.. Add it up thats me అని పాటలో వినిపించారు.
కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ఓ రెండు నెలల గ్యాప్ తీసుకొని లోకేశ్ సినిమా పట్టాలెక్కిస్తారట. రజనీకాంత్ ‘కూలీ’ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమా ఇబ్బందికర ఫలితం తెచ్చుకున్నా ఆయన టేకింగ్ మీద బన్నీ నమ్మకం ఉంచాడని అంటున్నారు.