పోస్టర్‌ను చూసి సినిమా కథ చెప్పేస్తుంటారు.. ఈ మాట మనం చాలా ఏళ్ల నుండి వింటున్నాం. నిజానికి అలా చెప్పడం అసాధ్యం. ఒక్కోసారి అలా అయిపోతుంటుంది కూడా. అయితే టీజర్, ట్రైలర్ చూసి కథలు చెబుతున్నవాళ్లు కూడా ఉన్నారు. వాటిలో నిజం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కూడా. అయితే పాట చూసి సినిమా కథ చెప్పేయొచ్చా? ఏమో ఇటీవల వచ్చిన ‘మీసా పిల్ల..’ పాట చూసి కొంతమంది ‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సినిమా కథను అల్లేస్తున్నారు. అయితే ఆ అవకాశం ఇచ్చింది కూడా సినిమా టీమే.
చిరంజీవి అభిమానులు అయితే కచ్చితంగా చిరంజీవి గ్రేస్ కోసమే పాటను మళ్లీ మళ్లీ చూసుంటారు. నయనతార ఫ్యాన్స్ అయితే ఆమె రియాక్షన్స్ కోసం చూస్తారు. సగటు సినిమా అభిమాని అయితే రెండూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే కొంతమంది మాత్రం సినిమా లైన్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాటలో సినిమా లైన్‌కి సంబంధించిన ఏవైనా హింట్స్ దొరుకుతాయా అనేది చూస్తున్నారు. అలాంటి వారికి పాటలో మాజీ భార్యను మాజీ భర్త తిరిగి రావాలని కోరుకుంటున్న లిరిక్స్ వినిపించాయి.
దీంతో అనుకోని కారణం వల్ల తన నుండి దూరమైన భార్యను లేదంటే తనను దూరం పెట్టిన భార్యను తిరిగి బతిమాలి, బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చే మధ్య వయస్కుడిగా మన శంకర్ వరప్రసాద్‌గారు కనిపిస్తారు అని ఓ లెక్క వేస్తున్నారు. అయితే సినిమా కథను ఇలా ఒక్క పాటతో చెప్పేస్తారా? అంటే కష్టమే అని చెప్పాలి. ఒకవేళ అలా చెప్పినా ఆ పాటను రిలీజ్‌కి ఇన్ని రోజుల ముందు బయటకు వదలరు. కాబట్టి ఇదంతా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ అని అర్థమవుతోంది. ప్రేక్షకుల్ని ఓ ఆలోచనతో థియేటర్లకు రప్పించి లోపల సర్‌ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పొచ్చు.
ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. సంక్రాంతి రావాల్సిందే. ఎందుకంటే ‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సంక్రాంతికి వస్తున్నారు. అన్నట్లుగా సీజన్ తేలింది.. ఇంకా ఎప్పుడు అనే డేట్ మాత్రం టీమ్ చెప్పడం లేదు. ఎందుకో మరి.