నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు నారా రోహిత్. ‘బాణం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ‘సోలో’ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు. ‘ప్రతినిధి’ ‘రౌడీ ఫెలో’ ‘అసుర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకానొక సమయంలో వరుస సినిమాలను లైన్ లో పెట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు మినిమం గ్యారంటీ హీరో అని కూడా దర్శక నిర్మాతలకి గట్టి నమ్మకం ఉండేది.
అయితే అనుకోని విధంగా ‘తుంటరి’ ‘సావిత్రి’ ‘రాజా చెయ్యివేస్తే’ వంటి చిత్రాలు ప్లాపవ్వడంతో ఒక్కసారిగా కిందికి పడిపోయాడు. మధ్యలో వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘శమంతకమణి’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా.. ఆ చిత్రాల్లో వేరే హీరోలుండడంతో రోహిత్ కు క్రెడిట్ దక్కలేదు. అయినా ‘కథలో రాజకుమారి’ ‘ఆటగాళ్ళు’ ‘వీర భోగ వసంత రాయలు’ వంటి చిత్రాలు చేసినా అవి కూడా డిజాస్టర్లు అయ్యాయి . దీంతో అతని మార్కెట్ బాగా దెబ్బతింది. హీరోగా ఎంట్రీ ఇచ్చి చేతి నిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నారా రోహిత్ ఎన్నడూ లేని విధంగా ఖాళీగా ఉండిపోయాడు. దాదాపు పది నెలలుగా అతని నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడం గమనార్హం. ఏదైనా సినిమా చేస్తున్నాడా..? అంటే అది కూడా చప్పుడు లేదు. ‘బాణం’ దర్శకుడితో ‘అనగనగా దక్షిణాది’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసినా అది ఆగిపోయింది. ‘శబ్దం’ అనే మరో సినిమా కూడా అనుకున్నారు. అది శబ్దం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి హాజరయ్యాడు రోహిత్. ఈ వేడుకలో నారా రోహిత్ ని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఫిజిక్ మైంటైన్ చేయకుండా.. గడ్డం పెంచేసి ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు రోహిత్. ఈ లుక్ చూస్తే రోహిత్ ఇండస్ట్రీ నుండీ సర్దేసాడనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరి రోహిత్ సినిమా చేస్తున్నట్టా? లేనట్టా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదేమో.