సోనూ సూద్ మనకు చాలా రోజుల నుండి తెలుసు. చాలా సినిమాల్లో విలనిజం పండించి… తెలుగు వాళ్లకు బాగా దగ్గరైపోయాడు. అయితే దేశంలోకి కరోనా వచ్చాక సోనూ హీరో అయిపోయాడు… కొన్ని రోజులకు సూపర్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం సాయానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయాడు. అయితే సోనూ తొలి రోజుల నుండి ఇలానే ఉన్నాడా? ఏమో సాయం చేసే అవకాశం రాలేదు కాబట్టి.. చేయలేదేమో అనుకుందాం. కానీ తొలి నాళ్లలో సోనూ ఇలా లేడు అంటున్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
ఇది నాలుగేళ్ల క్రితం మాట… అప్పటికి సోనూ సూద్ బయట సాధారణ మనిషిగా, సినిమాల్లో విలన్‌గా ఉన్న రోజులు. వికలాంగుల సంక్షేమం కోసం చేస్తున్న ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరవ్వమని సోనూ సూద్‌ను తమ్మారెడ్డి భరద్వాజ కోరారట. దానికి సోనూ చెప్పిన సమాధానం విని తమ్మారెడ్డి ఆశ్చర్యపోయారట. ‘డబ్బులిస్తే వస్తాను’ ఇదీ తమ్మారెడ్డికి సోనూ ఆన్సర్. ఇప్పుడు మనం ఈ మాట నమ్మకపోవచ్చు. కానీ అప్పుడు ఆయన ఈ మాట అన్నాడు అని తమ్మారెడ్డి కచ్చితంగా చెబుతున్నారు.
సాయం కోసం చేస్తున్న ఓ కార్యక్రమానికి రావడానికి అంత కమర్షియల్‌గా ఆలోచించిన సోనూ సూద్… ఇప్పుడు ఇన్ని సాయాలు చేస్తూ దేవుడయ్యాడు. అసలు సోనూ జీవితంలో, శైలిలో ఇంత మార్పు రావడానికి కారణం ఎవరు? అంతగా ఆయనను మార్చేసిన విషయం ఏంటి? అనేదే ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయం. ఏదైతేనేం పది మందికి మంచి చేసి దేవుడిగా మారిపోయారు సోనూ సూద్. మరి తమ్మారెడ్డి మాటలకు సోనూ ఏదైనా సమాధానం చెబుతారా? అప్పుడు జరిగింది ఎందుకులే అని వదిలేస్తారో మరి.