ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని సాధ్యమైతే పెళ్లి పిలవాలని ఎవరైనా అనుకుంటారు. అలాంటిది రావద్దనటం ఏమిటి.. అదీ తనతో సినిమాలు చేసిన హీరోనే తనను వద్దనటం విచిత్రమే. అదేంటో తెలుసుకుందాం. సూపర్‌స్టార్ కృష్ణ జయలలితతో కలిసి ‘గూఢాచారి 116’, ‘నిలువు దోపిడీ’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. జయ మృతి సందర్భంగా ఆమెతో తన జ్ఞాపకాలను గతంలో కృష్ణ ఓ సారి పంచుకున్నారు. తన పెద్దకూతురు పద్మావతి పెళ్లికి జయలలితను రావొద్దని చెప్పానంటూ షాక్ ఇచ్చారు సూపర్ స్టార్. కృష్ణ మాట్లాడుతూ…
కృష్ణ కూతురు పద్మావతి వివాహం చెన్నైలో జరుగుతున్నప్పుడు తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నారు. తన కూతురు పెళ్లికి రావాల్సిందిగా జయను కృష్ణ ఆహ్వానించాడు. జయ తన ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా వస్తానని మాటిచ్చారు. కానీ మూడు రోజుల తర్వాత జయ భద్రతా అధికారి కృష్ణ వద్దకు వచ్చి, భద్రతా కారణాల దృష్ట్యా మండపంలోని మొదటి మూడు వరుసలను సీఎం, తన భద్రతా సిబ్బందికి కేటాయించమని చెప్పారు. ఆ అధికారి చెప్పిన దానికి సూపర్ స్టార్ షాక్ అయ్యాడు.
ఆ పెళ్లికి ఏపీ నుంచి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి మూడు వరుసలు జయలలితకు కేటాయించడం కష్టమని కృష్ణ అభిప్రాయపడ్డారు. అందుకే తన సమస్యను జయలలితకు చెప్పి పెళ్లికి రావద్దని సున్నితంగా చెప్పాడట. కృష్ణ ఇచ్చిన వివరణకు జయలలిత నవ్వుతూ సరే అన్నారట. అయితే పెళ్లి రోజున (Jayalalitha) జయలలిత కృష్ణ కుమార్తెను ఆశీర్వదించేందుకు బొకే పంపారట.