కేవలం దర్శకుడు ఉంటేనే సినిమా కథ సిద్ధం చేయడం కుదరదు.. ఆయనతోపాటు ఓ కథా రచయిత కూడా ఉండాలి. ఆయనలోనే ఆ రచయిత ఉంటే ఇబ్బందే లేదు. ఇలా కాంబినేషన్ కుదరకపోవడం వల్ల పెద్ద పెద్ద దర్శకులు కాల క్రమేణా కనుమరుగు అయిపోతుంటారు. కొందరేమో పూర్వపు ఫామ్‌ను కొనసాగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు శంకర్‌ను (Shankar) చూసి, ఆయన సినిమాలను చూసి ఇదే మాట అంటున్నారు. ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవడం సహజం.
అక్కడ నుండి అప్‌డేట్ కాకపోతే ఔట్ డేటెడ్ అనే ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కెరీర్ సాఫీగా సాగదు. దీనికి తెలుగులో చాలా ఉదాహరణలే ఉన్నా.. ఎక్కువమంది చెప్పుకునే దర్శకుడు విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) . ఆయన, త్రివిక్రమ్ కలసి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. ఎప్పుడైతే త్రివిక్రమ్ (Trivikram) బయటకు వచ్చేశారో, అప్పటి నుండి విజయ్ భాస్కర్‌కు విజయాలు లేవు. ఇప్పుడు శంకర్ విషయంలోనూ అదే జరుగుతోందా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. అయితే ఇక్కడ పరాజయాలు లేవు కానీ, ఒకప్పటి స్థాయి విజయాలు రావడం లదేఉ.
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా చూశాక శంకర్ పూర్తిగా టచ్ కోల్పోయారని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. కథ, కథనంలో మునపటి పట్టు ఉండటం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. గత పదేళ్లలో ఆయన నుండి ఆయన స్థాయి విజయాలు లేవు. శంకర్ కథల్లో, ఆయన సినిమాల్లోని సన్నివేశాల్లో బిగి సడలింది అని అంటున్నారు. దానికి అభిమానులు, ప్రేక్షకులు, విశ్లేషకులు చెబుతున్న ప్రధాన లోపం.. రైటర్ సుజాత. తమిళ లెజండరీ రచయితల్లో రంగరాజన్ ఒకరు.
ఆయన కలం పేరే సుజాత (Sujatha) . నవలా రచయితగా, స్క్రీన్ రైటర్‌గా ఆయనకు చాలా పెద్ద పేరుంది. ఎప్పటి నుండో సినిమాల్లో ఉన్నా.. స్క్రీన్ రైటర్‌గా పేరు వచ్చింది మాత్రం శంకర్ సినిమాలతోనే. శంకర్, సుజాత కలసి ‘ఇండియన్’ / ‘భారతీయుడు’తో తమ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ‘ఒకే ఒక్కడు’, ‘బాయ్స్’ (Boys) , ‘అపరిచితుడు’, ‘శివాజీ’ (Sivaji: The Boss) , ‘రోబో’ (Robo/Enthiran) సినిమాలు చేశారు. అయితే సుజాత 2008లో చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘ఐ’, ‘2.0’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
దీంతో సుజాతతోనే శంకర్ వైభవం పోయింది అని అంటున్నారు కొంతమంది. అయితే ఆయన ఇప్పుడు జయమోహన్‌తో కలసి ‘2.0’, ‘భారతీయుడు 2’ చేశారు. సుజాతలా జయమోహన్ రాణించలేకపోతున్నారు అనేది ప్రేక్షకుల మాట. అయితే, శంకర్ తన తర్వాతి సినిమా అదేనండీ రామ్‌చరణ్‌తో (Ram Charan) చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’కి (Game changer) తన శిష్యుడు కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కథ తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కార్తిక్ సుబ్బరాజు కీలకంగా ఉన్నారట. దీంతో శంకర్ తిరిగి పునర్ వైభవం తెచ్చుకునేది ఈ సినిమాతోనే అని అంటున్నారు.