రెమ్యూనరేషన్‌ పంచాయితీ… స్టార్‌ హీరో తప్పుకున్నాడా?

ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా, స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలు సాధించినా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాతో ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పేరు సంపాదించారు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya). ఇప్పుడు కూడా ఆయన బ్యానర్‌లో నాలుగు సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌ నుండి దానయ్య తప్పుకున్నారు అని లేటెస్ట్ టాక్.

తమిళ స్టార్‌ హీరో – దానయ్య అంటే… ఆ హీరో విజయ్‌ (Vijay) అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత దానయ్య కాస్త గ్యాప్‌ తీసుకొని సినిమాలు మళ్లీ షురూ చేశారు. అలా ‘ఓజీ’ (OG Movie), ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) , ‘అధీరా’ సెట్స్‌ మీద ఉన్నాయి. ఇటీవల నాని (Nani) – సుజీత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు కూడా. వీటితోపాటు తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తారని ఆ మధ్య టాక్‌ నడిచింది. అదే విజయ్‌ ఆఖరి సినిమా అని కూడా అన్నారు.

ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ‘గోట్: గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత దానయ్యతో సినిమా అని అన్నారు. అయితే ఇప్పుడు రెమ్యూనరేషన్‌ దగ్గర వచ్చిన డిఫరెన్స్‌ల వల్ల ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లకూడదని దానయ్య అనుకుంటున్నారని ఓ టాక్‌ వినిపిస్తోంది.

తొలుత ఈ సినిమాను ‘జిగర్తాండ’ (Jigarthanda) దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) చేస్తారు అని టాక్‌ వచ్చింది. ఆ తర్వాత కొన్ని పేర్లు వినిపించినా… ఇటీవల హెచ్‌ వినోధ్‌ పేరు ఫైనల్ చేశారట. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు వేరే నిర్మాతను చూసే పనిలో ఉన్నారు అని సమాచారం. అయితే ఇక్కడ సమస్య రెమ్యూనరేషన్‌ కాదని, తెలుగు దర్శకుడితో దానయ్య ఆ సినిమా చేయాలనుకున్నారని మరో చర్చ. అలా అయితే తెలుగు మార్కెట్‌ కూడా బాగుంటుంది అనేది ఆయన ఆలోచన అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus