తెలుగు సినిమాకు అతి పెద్ద కష్టం ఇటీవల కాలంలో అంటే పైరసీ. ఇలా సినిమా థియేటర్లలో విడుదలవుతుందో లేదో అలా పైరసీ చేసేసి గ్రూపుల్లో షేర్ చేసేసేవారు. ఆ తర్వాత ఓ వెబ్‌సైట్ పెట్టి మరీ ఉచితంగా చూపించేశారు. ఇది కొత్తపని కాకపోయినా.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్ పెట్టి మరీ అందరికీ సులభంగా అందించేశారు. అయితే ఇదంతా గతం. ఎందుకంటే ఇటీవల ఆ వెబ్‌సైట్ ఓనర్ (?)ని అరెస్టు చేశారు, వాటిని మూసేశారు. ఇప్పుడు తెలుగు సినిమాకు అతి పెద్ద సమస్య తీరినట్లే అని చెప్పొచ్చు. దీంతో మరో ప్రశ్న టాలీవుడ్‌లో మొదలైంది. అదే రేట్లు.
అవును, తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య టికెట్ ధరలు. ఆ మాటకొస్తే థియేటర్లు/ మాల్స్‌లోని స్నాక్స్ ధరలు. నలుగురున్న కుటుంబం రిలీజ్ సమయంలో థియేటర్‌కి వెళ్తే తక్కువలో తక్కువ రూ.వెయ్యి అవుతోంది. రానుపోను, స్నాక్స్ కలుపుకుంటే రూ.2000 అవుతోంది. అదే మల్టీప్లెక్స్‌కి వెళ్తే అన్నింటినీ డబుల్ చేసేయొచ్చు. చిన్న సినిమా, పెద్ద సినిమా, డబ్బింగ్ సినిమ, స్ట్రెయిట్ సినిమా అనే తేడా లేకుండా అదే రేటు వసూలు చేస్తున్నారు. ఇది ఎవరూ కాదనలేని విషయం.
పెద్ద హీరోల రిలీజ్ సమయంలో, ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకుని ప్రేమ చూపించే చిన్న సినిమాలకు రిలీజ్ టైమ్‌లో ఆ రేటు మరోసారి డబుల్ అవుతుంది. ఇది కూడా ఎవరూ కాదనలేని విషయం. దీనికి కారణమేంటా అని అప్పట్లో నిర్మాతల్ని అడిగితే సినిమాకు లైఫ్ వారం లేదా రెండు వారాలే. ఇప్పుడే వసూళ్లు సాధించేయాలి అనేలా మాట్లాడారు. అయితే ఇప్పుడు పైరసీ సమస్య చాలావరకు ఆగిపోయినట్లే. అంటే మరి ఆ టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లు ఇప్పుడు తగ్గిస్తారా? లేక థియేటర్ / స్క్రీన్ ఒకటే ఆప్షన్ కాబట్టి ఇంకా వసూళ్లు ఎక్కువగా పిండేస్తారా?