ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసం, కార్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు ఈ సోదాలు చేస్తున్న సిబ్బంది.. దిల్ రాజు సోదరుడు శిరీష్ (Shirish) నివాసంలో తనిఖీలు ముగించారు. మరోవైపు దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజు సహా ప్రముఖ టాలీవుడ్ నిర్మాతల మీద ఐటీ శాఖ మంగళవారం నుండి సోదాలు చేస్తోంది.
50కిపైగా బృందాలుగా వేర్పడి ఐటీ శాఖ ఈ దాడులకు దిగింది. దిల్ రాజుకు సంబంధించినంతవరకు అయితే ఆయన భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లలోని వస్తువులు, డాక్యుమెంట్ల విషయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఐటీ అధికారులుఆసుపత్రికి తరలించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసులపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్‌లో ఐటీ శాఖ దాడులు కొత్త కానప్పటికీ ఈ స్థాయిలో, ఇన్ని రోజులు దాడులు చేయడం అనేది ఇదే తొలిసారి అని టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంతో రైడ్స్ తర్వాత అధికారులు ఏం చెబుతారు అనే విషయమై ఆసక్తి రేగింది. దాడుల విషయంలో ‘నా ఒక్కడి విషయంలోనే కాదు.. చాలామంది నిర్మాతల ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి’ అంటూ ఇప్పటికే ఓ సారి స్పందించిన దిల్ రాజు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడతారని తొలుత వార్తలొచ్చాయి.
కానీ ఆయన మీడియా ముందుకు రాలేదు. ఈ రోజు మాట్లాడతారని రాత్రి పొద్దు పోయాక చెప్పారు. కానీ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. అంటే ఐటీ దాడులు ముగిశాకే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది.