“నాంది” లాంటి జెన్యూన్ హిట్ తర్వాత అల్లరి నరేష్ నటించిన మరో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మరి నరేష్ తనకు రాకరాక వచ్చిన సక్సెస్ ను ఈ సినిమాతో కంటిన్యూ చేశాడా లేదా అనేది చూద్దాం..!!
కథ: మానవీయ బంధాలకు, సమాజ విలువలకు ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని ఉల్లాసంగా గడిపే సగటు ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ (అల్లరి నరేష్). మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బై ఎలెక్షన్ డ్యూటీ కోసం వెళతాడు. అక్కడి ప్రజలతో ఓట్లు వేయించడం కంటే.. వాళ్ళకి ఉన్న ప్రాధమిక హక్కుల వినియోగం ద్వారా వాళ్ళకు లభించాల్సిన కనీస స్థాయి వసతులను ఎలా దక్కించుకోవాలో వివరించాలనుకుంటాడు.
ఈ క్రమంలో ప్రభుత్వం, పోలీసులకు ఎదురుతిరగాల్సి వస్తుంది. ఈ ఎదురీతలో శ్రీనివాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? తన లక్ష్యాన్ని ఎలా చేధించాడు? అనేది “ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం” కథాంశం.
నటీనటుల పనితీరు: ఒక బాధ్యతగల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. అతడి మాటల్లో సున్నితత్వం, చూపుల్లో నిజాయితీ పాత్రను ఎలివేట్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఎమోషనల్ సీన్స్ లో ఎప్పట్లానే జీవించేశాడు నరేష్. నటుడిగా “నాంది” తర్వాత అతడి కెరీర్ కు మరో మెట్టు ఈ చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తెలుగమ్మాయి ఆనంది పల్లెటూరి ఆడపడుచుగా ఒదిగిపోయింది. ఆమె స్వంత డబ్బింగ్ & బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ తనదైన శైలి కామెడీ పంచులతో కడుపుబ్బ నవ్వించాడు. చాన్నాళ్ల తర్వాత ప్రవీణ్ కు మంచి పాత్ర లభించింది, అతడు ఆ పాత్రకు జీవం పోసాడు. సంపత్ రాజ్, సూర్యతేజ, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఏ.ఆర్.మోహన్ హిందీ చిత్రం “న్యూటన్” నుంచి మూల కథను ఇన్స్పైర్ అవ్వడం బాగానే ఉంది కానీ.. ఆ ఆత్మను పట్టుకోలేకపోయాడు. అందువల్ల సినిమాకి మంచి కాజ్ ఉన్నా.. కథనంలో పట్టు లేకుండాపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా పేలవంగా సాగడం, ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే పాయింట్ లేకపోవడం అనేది మైనస్ గా మారింది. ఆ సెకండాఫ్ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే మంచి హిట్ సినిమాగా నిలిచేది. సినిమాకి నిజాయితీ మాత్రమే కాదు.. విషయం కూడా ముఖ్యమని తెలియజెప్పే సినిమా ఇది.
శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. అలాగే రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ ను చక్కగా తెరకెక్కించాడు. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. అప్పటివరకూ సహజంగా సాగిన సినిమా.. పేలవమైన వి.ఎఫ్.ఎక్స్ కారణంగా అత్యంత అసహజంగా కనిపిస్తుంది.
విశ్లేషణ: సినిమాలో కంటెంట్ ఉండడం వేరు, సినిమా కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం వేరు. ఈ రెండిటి మధ్య తేడా గమనించక తడబడిన సినిమా “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”. అయితే.. చిత్రబృందం నిజాయితీగా చేసిన ప్రయత్నం కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.