“టిల్లు (DJ Tillu) & టిల్లు స్క్వేర్(Tillu Square) ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), తన ఇమేజ్ కు భిన్నంగా భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో నటించిన చిత్రం “జాక్” (Jack) . టీజర్ మంచి ఆసక్తి నెలకొల్పగా, ట్రైలర్ కాస్త డౌట్ పెట్టింది. మరి సినిమా ఎలా ఉంది? సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? భాస్కర్ దర్శకుడిగా కమ్ బ్యాక్ హిట్ అందుకున్నాడా? అనేది చూద్దాం..!!
కథ: పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల ఎలాగైనా ఇండియన్ రా ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించి, దేశానికి ఎలాంటి హాని జరగకుండా.. దేశం ముందు నిలబడాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఈ క్రమంలో రా చీఫ్ మనోజ్ (ప్రకాష్ రాజ్ (Prakash Raj ) & టీమ్ ను ఇబ్బందిపెడుతుంటాడు. అదే సమయంలో అసలు జాక్ ఏం చేస్తుంటాడా? అని వెతుకుతూ ఉంటుంది భానుమతి అలియాస్ అఫ్సాన్ (వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)).
జాక్ & మనోజ్ వెతుకుతున్నది ఎవర్ని? ఎలాంటి సమస్యను ఢీ కొట్టారు? ఆ సమస్య ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “జాక్”(Jack) చిత్రం.
నటీనటుల పనితీరు: జాక్ పాత్రలో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ.. కొద్దిగా ఆండర్ ప్లే చేస్తూ సిద్ధు జొన్నలగడ్డ పర్వాలేదనిపించుకున్నాడు. అయితే.. ఉర్దూ మిక్స్ హిందీ భాషలో పలికే మాటలు మినహా ఎక్కడా పెద్దగా హాస్యం పండలేదు. ఆ కారణంగా సిద్దు నుంచి రెగ్యులర్ ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది.
వైష్ణవి చైతన్య తెలంగాణ యాస మాట్లాడడానికి ఎంత కష్టపడిందో, ముస్లిం యువతిగా నటించడానికి కూడా అంతే కష్టపడింది. అక్కడక్కడా అందంగా కనిపించింది కానీ.. ఓవరాల్ గా ఆమె పాత్రకు సరైన క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడం, ఆమె ఎందుకు కథలో ఉంది అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఆమె పాత్ర పెద్దగా పండలేదు.
ప్రకాష్ రాజ్ పోషించిన రా చీఫ్ పాత్రలో కామెడీ పండించాలనుకున్న ఆలోచన బాగున్నప్పటికీ.. లాజికల్ గా స్క్రీన్ ప్లే రాసుకోవడం అనేది పెద్ద మైనస్ గా మారింది.
రాహుల్ దేవ్ ఒక్కడు తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. నరేష్(Naresh), రవి, బ్రహ్మాజీ (Brahmaji) తదితరులు మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సామ్ సి.ఎస్(Sam C. S.) నేపథ్య సంగీతం సినిమాకి ఏమాత్రం ప్లస్ అవ్వలేకపోయింది. ఎంత కామెడీ సినిమా అయినప్పటికీ, అందులో కూడా సీరియస్ థీమ్ ఉన్న అంశాన్ని సరిగా ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు సామ్. సురేష్ బొబ్బిలి (Suresh Bobbili ) అందించిన “కిస్” పాట మాత్రం వినసొంపుగా ఉండడమే కాక చూడ్డానికి కూడా బాగుంది.
పాబ్లో నెరుడా టైటిల్ సాంగ్ కథను ఆడియన్స్ కు అర్థమయ్యేలా చేయకపోగా.. బోర్ కొట్టించింది.
విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ వర్క్ అలరించలేకపోయింది. సీజీ & గ్రీన్ స్క్రీన్ షాట్స్ క్వాలిటీ మరీ చీప్ గా ఉండడంతో.. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మైనస్ గా కూడా మారింది. అసలే చార్మినార్ సీన్స్ ఎబ్బెట్టుగా ఉండగా.. చివర్లో వచ్చే ట్రైన్ సీక్వెన్స్ లో వాడిన సీజీ మరీ చీప్ గా ఉంది. ఇక సినిమా మొదట్లో AI ఫుటేజ్ వాడుతూ కథను ఆరంభించడం అనేది కూడా సరిగా సింక్ అవ్వలేదు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ బడ్జెట్ ఇష్యూస్ కారణంగా సినిమాకి మైనస్ గా మారాయి.
దర్శకుడు భాస్కర్ కథకుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల్ని అలరించడంలో తడబడ్డాడు. ఒక స్పై థ్రిల్లర్ అనుకున్నప్పుడు, అందులో ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అలాగే.. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉండాలి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్ లాజికల్ గా ఉండాలి. “జాక్” సినిమాలో అవేమీ లేవు. సిద్ధు అక్కడక్కడా పండించే కామెడీ తప్ప, సినిమాలో చెప్పుకోదగ్గ అంశం కానీ, ఎగ్జైట్ చేసే థీమ్ కానీ లేకపోవడం కారణంగా “జాక్” డీలాపడడమే కాక, ప్రేక్షకులకు అలసత్వాన్ని కలిగించింది.
విశ్లేషణ: స్పై థ్రిల్లర్స్ ను పేరడీ ఫార్మాట్ లో పిక్చరైజ్ చేసిన సినిమాలు కోకొల్లలు. అయితే.. అవి చాలా సిన్సియర్ గా, ఇది పేరడీ అని గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ.. ఒక సీరియస్ అంశం చుట్టూ కామెడీగా, అది కూడా రా ఏజెన్సీని ఇన్వాల్వ్ చేస్తూ తెరకెక్కించడం అనేది “జాక్” సినిమాకి మెయిన్ మైనస్. అయితే.. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ మాత్రమే సినిమాకి చిన్నపాటి ప్లస్. అయితే.. అక్కడక్కడా వచ్చే ఆ కామెడీ కోసం 136 నిమిషాల సినిమా చూడాలంటే మాత్రం కాస్తంత ఓపిక కావాలి.
ఫోకస్ పాయింట్: జాక్ ఇట్స్ నాట్ ఏ జోక్!
రేటింగ్: 2/5