‘కల్కి 2’ సినిమా టీమ్ నుండి ఓ ప్రకటనకు రంగం సిద్ధమవుతోందా? కుదిరితే ఆ ప్రకటనలో రెండు కీలకమైన విషయాలు తెలియబోతున్నాయా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘ఆ సినిమా నుండి అప్‌డేట్లు అంటే అందులోనూ కీలకమైన అప్‌డేట్లు అంటే రెండే ఉన్నాయి మరి. ఒకటి హీరోయిన్, రెండోది సినిమా షూటింగ్ ప్రారంభించాల్సిన డేట్’ అని అంటున్నారు కదా. అవును మీరు ఊహించింది కరెక్టే. ఆ రెండు అంశాలు కలిపి ఒకటే పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేయబోతున్నారు అని రీసెంట్ టాక్ సారాంశం.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అంత హైప్ రావడానికి, బాలీవుడ్‌లోనూ ఆసక్తి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ దీపికా పడుకొణె. అయితే ఆ సినిమా నుండి ఆమె తప్పుకున్నారు / ఆమెను తప్పించారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ నోట్ రిలీజ్ చేసి మరీ చెప్పింది. ఈ క్రమంలో నిబద్ధత లాంటి పెద్ద పదాలు కూడా వాడేశారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు అదే సంస్థ మరో నోట్ రిలీజ్ చేసి కొత్త హీరోయిన్‌ను అనౌన్స్ చేయబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రామ్‌చరణ్ ‘ఫస్ట్’ హీరోయినే నటించనుందని సమాచారం.

తొలి భాగంలో దీపిక చేసిన సుమతి పాత్రను ప్రియాంక చోప్రా చేస్తుందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘వారణాసి’ సినిమా చేస్తున్న ప్రియాక ఈ సినిమాకు కూడా ఓకే చెప్పిందట. రామ్‌చరణ్ తొలి హిందీ సినిమా ‘జంజీర్’లో ప్రియాంకనే హీరోయిన్ అనే విషయం తెలిసిందే. అంటే ప్రభాస్ సినిమాలో కీలక పాత్రకు ఆయన ఫ్రెండ్ హీరోయినే నటిస్తుందన్నమాట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా చెబుతూ సినిమా షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందని విషయం కూడా సినిమా టీమ్ చెప్పొచ్చని టాక్. చూద్దాం మరి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో మరి. ఎందుకంటే ఆయన వరుస సినిమాలతో బిజీ.
