‘పుష్ప’ (Pushpa) సినిమాలో హీరో తర్వాత హీరోయిన్ కంటే ఎక్కువగా కనిపించే మనిషి, వినిపించే పేరు కేశవ. పుష్పరాజ్ యాటిట్యూడ్ నచ్చి అతని పక్కకు చేరే కుర్రాడి పాత్ర అది. దీనిని సినిమాలో జగదీశ్ (Jagadesh) అనే కొత్త నటుడు నటించి మెప్పించాడు కూడా. అయితే ఈ పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసి తీసుకున్నారనే విషయం మీకు తెలిసిందే. టీవీ నటులు, యూట్యూబర్లు, సినిమాల్లో చిన్న చిన్న పాత్ర వేసినవాళ్లూ ఆ జాబితాలో ఉన్నారు. ఇందులో యువ కథానాయకుడు సుహాస్ (Suhas) కూడా ఉన్నాడు.
‘కేశవ’ పాత్ర కోసం తొలుత సుహాస్‌ని అనుకున్నాం.. కానీ తీసుకోలేదు అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) చెప్పారు. సుహాస్ హీరోగా నటించిన ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్స్ చేశారు. సుహాస్ అంటే నాకు, అల్లు అర్జున్‌కు ఇష్టం. నీ ఎదుగుదల చూస్తున్నాం కూడా. అయితే హీరోగా చేస్తున్న తనను కేశవ పాత్రకు ఎంపిక చేయడం బాగోదు అని అనిపించింది అందుకే తీసుకోలేదు అని చెప్పారు సుకుమార్.
అంతేకాదు సుహాస్‌ని మట్టి నటుడు అంటూ పొగిడేశారు. అంతగా ఆయన పాత్రల్లో ఒదిగిపోతాడు అని చెప్పారు. ఇక ఈ సినిమా దర్శకుడు అర్జున్ కూడా సుకుమార్ శిష్యుడే. ‘ఆర్య’ (Aarya) సినిమా తర్వా అర్జున్ ఓసారి తన దగ్గరకు వచ్చి మీతో పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అతడిని తన టీంలో జాయిన్ చేసుకున్నాను అని సుకుమార్ తెలిపారు.
అర్జున్ అమాయకుడు, కానీ లాజిక్ ఉన్నవాడు. అర్జున్, తన మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లోనే ‘100% లవ్’ (100% Love) స్టోరీ రాసేశా అని చెప్పారు సుకుమార్. అప్పటి నుండి తన ప్రతి సినిమాకి అర్జున్, శ్రీను పనిచేశారట. అర్జున్ బిజీగా ఉండడంతో తాను లాజిక్ ఉన్న సినిమాలను రాయడం మానేశా అని సుకుమార్ చెప్పారు.