ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించడంతో భారీ బడ్జెట్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతామని చెబుతున్నా భారీగా టికెట్ రేట్లు పెరిగే అవకాశం అయితే లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెరుగుతాయని ఏ సెంటర్లలో మాత్రం టికెట్ రేట్లలో పెద్దగా మార్పు ఉండదని సమాచారం అందుతోంది.
మరోవైపు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను మరింత పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ షరతులో ఒక మెలిక ఉంది. హీరో, హీరోయిన్, దర్శకుని పారితోషికాలు కలపకుండా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అయితే ఈ షరతు వల్ల ప్రస్తుతం ప్రభాస్, రాజమౌళి సినిమాలకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం పెద్ద సినిమాల బడ్జెట్ లో 50 నుంచి 60 శాతం వరకు హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చవుతోంది. సినిమాల బడ్జెట్లకు సంబంధించి దర్శకనిర్మాతలు సరైన లెక్కలు చెబుతారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలులోకి తెస్తున్న నిబంధనల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం సమస్యను సృష్టించి పరిష్కరించినట్లు చెబుతోందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కొత్త టికెట్ రేట్లు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయో క్లారిటీ రావాల్సి ఉంది. టికెట్ రేట్లు పెరిగితే మాత్రమే పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరుతుంది. పెద్ద సినిమాల కలెక్షన్లలో 60 శాతం కలెక్షన్లు ఏపీ నుంచే వస్తాయి. రాధేశ్యామ్ సినిమా రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కాయి.