జగపతి బాబు (Jagapathi Babu) గతంలో సీరియస్ పాత్రలు పోషించేవారు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరో అయిపోయి కాస్త కామెడీ జోనర్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు విలన్, క్యారెక్టర్ యాక్టర్ అయ్యి తిరిగి సీరియస్ రోల్స్‌లోకి వచ్చారు. అయితే ఇదంతా సినిమాల వరకే. నిజ జీవితంలో ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో చేసే పోస్టులు, అప్‌లోడ్ చేసే వీడియోలు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది కూడా.
తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. జగపతి బాబు (Jagapathi Babu) నిజ జీవితంలో జరిగే విషయాల్ని సరదా కామెంట్లు జోడిస్తూ షేర్ చేస్తుంటారు. ఆయన భోజనపు అలవాట్లు, దైనందిన కార్యక్రమాలు అందులో ఉంటూ ఉంటాయి. అలాగే సినిమా సెట్స్‌లో జరిగే విషయాలు కూడా కొన్ని షేర్ చేస్తుంటారు. ఆయన తాజాగా ఓ సినిమా సెట్‌లో సరదాగా చేసిన రీల్‌ను షేర్ చేశారు. దానికి కామెంట్‌గా ‘కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు’ అనే రైటప్ పెట్టారు. ఈ మాట వినగానే ‘శుభలగ్నం’ సినిమా గుర్తొస్తుంది.
జగపతిబాబు, ఆమని (Aamani) ప్రధాన పాత్రల్లో ‘శుభలగ్నం’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ టచ్ చేయడానికి కూడా సాహసించని పాయింట్‌తో ఎస్వీ కృష్ణా రెడ్డి ఆ సినిమా తెరకెక్కించారు. నీ భర్తను ఇస్తే కోటి రూపాయలు ఇస్తా అని రోజా ముందుకొస్తే.. జగపతిబాబును ఆమని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత చాలా బాధపడుతుంది. ఈ మనసుల్ని మెలితిప్పే సినిమాకు బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు వచ్చాయి.
ఆ సినిమాలో సీన్‌ను గుర్తు చేసేలా జగపతి బాబు కొత్త వీడియో ఉంది. ఇందులో ఓ కుర్చీలో దర్జాగా ఆమని కూర్చుని మొబైల్ చూస్తుంటే.. నీడ కోసం గొడుగు పట్టి మేకప్ వేసే వ్యక్తిగా జగపతిబాబు కనిపించాడు. ఇదంతా సినిమా సెట్‌లో జరిగే విషయం లానే ఉంటుంది. మరి కనిపించి ఏం మాట్లాడారు అనేది మీరే వీడియోలో చూడండి.