సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో సెంటిమెంట్ వర్కవుట్ అవుతూ ఉంటుంది. హీరోలు, దర్శకులు అనుకుని చేయకపోయినా… దగ్గర దగ్గర ఒకే తరహా సినిమాలు, ఒకే నేపథ్యం ఉన్న సినిమాలు, ఒకే కీలక పాయింట్ సినిమాలు వచ్చేస్తుంటాయి. ఆ సినిమాలు మంచి విజయం అందుకుంటూ ఉంటాయి. అదే సమయంలో అలాంటి కీలక అంశంతో ఓ సినిమా రెడీ అవుతూ ఉంటుంది. దీంతో ఆ సెంటిమెంట్ / పాయింట్ బ్లాక్‌బస్టర్‌కి దగ్గరి రూటా అనిపిస్తుంది.
సినిమాల్లో కొన్ని సెంటిమెంట్లు నమ్మడానికి, చూడటానికి కొంచెం కొత్తగా ఉంటాయి. కానీ అవి సక్సెస్ అయ్యేసరికి రాబోయే సినిమాలోనూ కనిపిస్తే ఇంకా ఆసక్తికరంగా కనిపిస్తుంది. అలాంటి కాన్సెప్ట్ ‘జైలు’. అవును మీరు చదివింది కరెక్ట్. రీసెంట్ టైమ్స్‌లో ఈ బ్యాగ్రౌండ్‌లో వచ్చి రెండు సినిమాలు విజయం అందుకున్నాయి. ఓ సినిమా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మరో సినిమా రూ. 129 కోట్లు వసూలు చేసి అదే దారిలో ఉంది. ఇప్పటికే ఆ సినిమాలేంటో మీకు తెలిసిపోయే ఉంటాయి.
జైలు పేరును సినిమా టైటిల్‌లో పెట్టుకున్న (Jailer) ‘జైలర్’ తొలి సినిమా కాగా, రెండో సినిమా ‘జవాన్’. తొలి సినిమాలో రజనీకాంత్ జైలర్‌గా నటించి మెప్పించారు. రెండో సినిమాలో కీలక సన్నివేశాలన్నీ జైలు నేపథ్యంలోనే ఉంటాయి. ఈ రెండు సినిమాల్ని కలిపి ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌కి జైలు దగ్గరి దారి అని లెక్క కట్టేస్తున్నారు. దాంతోపాటు విజయదశమి కానుకగా రాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాలో కూడా జైలు సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి అంటున్నారు.
అంతేకాదు ఆ తర్వాత వచ్చే విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు కూడా జైలు నేపథ్యంలోనే ఉంటాయి అని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలు కూడా విజయం సాధిస్తే… త్వరలో వరుసగా జైలు నేపథ్య సినిమాలు వస్తాయి అని చెప్పొచ్చు. మరి రెండు సినిమాల విజయ పరంపర కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. సాధిస్తే ఆ మజానే వేరు.