మహానటి సావిత్రి అభినయాన్ని చూసి మెచ్చుకోని తెలుగువారు ఉండరు. అలాగే ఆమె మరణ వార్త విని విలపించినవారెందరో. అయితే సావిత్రి మరణం వెనుక ఎన్నో కారణాలున్నాయి. తాగుడుకు బానిసై చనిపోయారని.. వైద్యానికి డబ్బుల్లేక మంచంపట్టారని.. మనోవేధనతో తనువుచాలించారని.. ఇలా రకరకాలుగా ప్రచారం సాగింది. సాగుతోంది. అసలు కారణాన్ని అలనాటి మరో సీనియర్ నటి జమున వెల్లడించారు. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో సావిత్రి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. “నన్ను సావిత్రి చెల్లి అని పిలిచేది. ఆమె దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడేది. చిన్నారి పాపలు సినిమా అప్పుడు తన ఇల్లు, వస్తువులు తాకట్టు పెట్టి రిలీజ్ చేసింది. అది నష్టాన్ని మిగిల్చింది.
అయినా భయపడలేదు. ఇక్కడ విజయం సాధించిన మూగ మనసులు సినిమాని తమిళంలో “ప్రాప్తం” అని రీమేక్ చేసింది. అందులో చంద్రకళ, శివాజీ గణేశన్ నటించారు. ఈ సినిమా మొదలయ్యేటప్పుడు శివాజీ గణేశన్ పై క్రేజ్ బాగాఉండేది. ఆ తర్వాత సినిమాలన్నీ ఫెయిల్ అవుతుండడంతో ఆ ప్రభావం ఈ చిత్రంపై పడింది. పూర్తి అవ్వడానికి ఐదేళ్లు పట్టింది. దీనిని కొనేందుకు బయ్యర్స్ ఎవరూ ముందుకు రాలేదు. కాబట్టి సొంతంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో సావిత్రి నిండా అప్పుల్లో మునిగిపోయింది” అని వివరించారు. ఆ ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆమె తాగుడికి బానిసై ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని తెలిపారు. సావిత్రి జీవితంపై నాగ్ అశ్విన్ మహానటి అనే సినిమాని తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 9 న రిలీజ్ కానుంది. మరి అందులో ఈ విషయాన్ని ప్రస్తావించారో లేదో చూడాలి.