సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జూలై 12న కంటి ఆపరేషన్ జరిగింది. ఎడమ కంటిపై కురుపు ఏర్పడటంతో.. గత కొద్దిరోజుల నుంచి ఇబ్బంది పడుతూనే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. అయితే.. అదీ మరీ తీవ్రతరం అవుతుండటంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. పవన్ కళ్యాణ్ కంటిని పరీక్షించిన వైద్యులు.. చిన్నపాటి ఆపరేషన్ ద్వారా ఆ కురుపుని తొలగించారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తాజా ఆపరేషన్ నేపథ్యంలో.. కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
కంటి సమస్యపై పది రోజుల క్రితమే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులను పవన్ సంప్రదించగా.. ఆపరేషన్ ఒక్కటే మార్గమని చెప్పినట్లు తెలిసింది. దీంతో.. తీరిక చూసుకుని.. తాజాగా పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నెల 16న మళ్లీ ఈ జనసేన అధినేత ప్రజా పోరాటయాత్రలో పాల్గొనాల్సి ఉంది. యాత్ర జరగనున్న తూర్పు గోదావరి జిల్లాకి ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు సమాచారం.