జనతా హోటల్

  • September 14, 2018 / 10:17 AM IST

2012లో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన “ఉస్తాద్ హోటల్” చిత్రాన్ని తెలుగులో “జనతా హోటల్”గా అనువదించి విడుదల చేశారు సురేష్ కొండేటి. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడిన అనంతరం ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 14) విడుదలైంది. సో, ఈ తెలుగు డబ్బింగ్ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

కథ : ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నాలుగు అమ్మాయిల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో ఇంట్లో అక్కలు-తండ్రి అల్లారుముద్దుగా పెంచుతారు. సంపన్న కుటుంబానికి చెందిన తండ్రి ఫైజల్ తో స్టార్ హోటల్ పెట్టించాలనుకొంటాడు కానీ.. ఫైజల్ కి వంటలు చేయడం మీద ఉన్న ఇష్టం అతడ్ని విదేశాల్లో తండ్రికి తెలియకుండా హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చేసేలా చేస్తుంది. ఆ విషయం షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు టైమ్ లో తెలిసిపోవడంతో ఫైజల్ ను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు తండ్రి. ఆ సమయంలో తాతయ్య కరీంభాయ్ “జనతా హోటల్”లో పనిచేస్తూ తన డూప్లికేట్ పాస్ పోర్ట్ కోసం ఎదురుచూస్తుంటాడు.

అదే సమయంలో.. అక్కడి దగ్గరలోని బీచ్ బే హోటల్ తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం “జనతా హోటల్”ను ఆక్రమించుకొనే పనిలో ఉందని తెలుసుకొన్న ఫైజల్ ఆ హోటల్ మీద ఉన్న అప్పును తన తెలివితో తీర్చి ఆ హోటల్ లో వర్క్ చేసేవాళ్లందరికీ కొత్త జీవితాన్నిస్తాడు. అయితే.. “జనతా హోటల్”ను డెవలేప్ చేసిన తర్వాత తనకు ప్యారిస్ లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోవాలనుకొంటాడు ఫైజల్. అప్పుడు వంట చేయడం కంటే ఆ వండిన భోజనంతో అందరి కడుపులతోపాటు మనసు కూడా నింపడంలో ఉన్న అనుభూతిని ఫైజల్ కి తెలియజెప్పాలనుకొంటాడు కరీం భాయ్.

ఆ అనుభూతిని స్వయంగా అనుభవించిన ఫైజల్ ఫారిన్ వెళ్ళడం మానేసి అదే జనతా హోటల్ ను చూసుకుంటూ.. తాను ఇష్టపడిన షహానా (నిత్యామీనన్)ను పెళ్లాడి కాకినాడలోనే సెటిల్ అయిపోవడంతో సినిమా ముగుస్తుంది.

నోట్ : 2012లో విడుదలైన మలయాళ చిత్రం కావడంతోపాటు థ్రిల్లర్ సినిమా కాకపోవడం వల్లనే కథ మొత్తం రాయాల్సి వచ్చింది. దయచేసి.. “కథ మొత్తం రాయడం ఎందుకు.. సినిమా కూడా అప్లోడ్ చేయండి” లాంటి చెత్త కామెంట్స్ పోస్ట్ చేయకండి.

నటీనటుల పనితీరు : దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లాంటి ప్రూవ్డ్ ఆర్టిస్ట్స్ నట ప్రతిభ గురించి ప్రత్యేకంగా ఏం చెబుతాం. వాళ్ళు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. అయితే.. నిత్యామీనన్ డబ్బింగ్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఆమె వ్యవహారశైలికి, ఆమె డబ్బింగ్ కి చాలా సన్నివేశాల్లో సింక్ అవ్వలేదు. కరీం భాయ్ పాత్రలో తిలకన్ నటనతోపాటు ఆయన కూడా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.

సాంకేతికవర్గం పనితీరు : గోపీసుందర్ సంగీతం బాగుంది కానీ.. సాహిత్యం మాత్రం పెద్ద ఆకట్టుకొనే స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ వర్క్, ఎడిటింగ్ అన్నీ బాగున్నప్పటికీ.. ఆరేళ్ళ క్రితం సినిమా కావడంతో అవన్నీ అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి.

ముఖ్యంగా సినిమాలోని చాలా ఎమోషనల్ సీన్స్ ను లెంగ్త్ ఎక్కువయ్యిందని కట్ చేయడంతో సినిమాలోని ఎమోషన్ మిస్ అయ్యింది. ఆ సన్నివేశాలను కూడా ఉంచి ఉంటే హీరో=హీరోయిన్ & హీరో-గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్ నడుమ ఉన్న బాండింగ్ ఆడియన్స్ ను ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేది.

విశ్లేషణ : మంచి ఫీల్ ఉన్న సినిమా అయినప్పటికీ.. ఆరేళ్ళ క్రితం సినిమా కావడంతో పాత సినిమా చూస్తున్నామనే భావన కలుగుతూనే ఉంటుంది. సో, టైమ్ పాస్ కోసం కావాలంటే థియేటర్లో ఒకసారి తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూడండి లేదంటే హాట్ స్టార్ లో ఉన్న ఒరిజినల్ మలయాళ వెర్షన్ ను ఇంటర్నెట్ లో చూడండి.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus