ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో కిష్టయ్య గత కొన్ని రోజులుగా ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని ఓదెల సంపత్ నంది స్వస్థలం. తండ్రి కిష్టయ్య అక్కడే ఉండేవారు. సంపత్ నంది తండ్రి కన్నుమూశారనే విషయం తెలిసిన తర్వాత సంపత్ నందికి సినిమా పరిశ్రమకు చెందిన సంతాపం తెలియజేస్తున్నారు.
తండ్రిని గుర్తు చేసుకుంటూ సంపత్ నంది సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘నాన్నా ఇకపై నువ్వు లేకుండానే నేను ఉండాలి. చిన్నప్పుడు నా ఆరోగ్యం బాగోలేకపోతే ఆయుర్వేద వైద్యం కోసం నీ భుజంపై 10 కిలోమీటర్లు ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది. ‘ఖైదీ’ సినిమాకు నన్ను దగ్గరుండి తీసుకెళ్లింది నిన్నే కదా అనిపిస్తోంది. ఏ సినిమా అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరు ఇచ్చి మావోడి దగ్గరికెళ్లు అని నువ్వు ప్రోత్సాహం ఇచ్చేవాడివి. ఇకపై అవన్నీ నాకు జ్ఞాపకాలే. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమాను థియేటర్లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
వరుణ్ సందేశ్ ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా సంపత్ నంది కెరీర్ మొదలైంది. ఆ తర్వాత రామ్ చరన్ ‘రచ్చ’ సినిమాతో స్టార్ హోదాకు దగ్గరగా వచ్చారు. ఆ తర్వాత గోపీచంద్‌తో ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’ సినిమాలు చేసి మంచి విజయాలే అందుకున్నారు. ఈ ఏడాది తమన్నా ప్రధాన పాత్రలో ఆయన నిర్మించిన ‘ఓదెల 2’ వచ్చింది. ఆ సినిమాకు రచయిత కమ్ నిర్మాత. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘భోగి’ అనే చేయనున్నారు.